యూరప్‌కు ఒక రూల్ - భారత్‌కు మరో రూలా? కోకాకోలా ఫాంటా వివాదంపై సుప్రీం సీరియస్
యూరోపియన్ దేశాల్లో విలాసంగా తాగే కూల్ డ్రింక్.. మన దేశానికి వచ్చేసరికి అనారోగ్యపు ముప్పుగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒకే బ్రాండ్ పేరుతో అమ్ముడవుతున్న ఉత్పత్తుల్లో నాణ్యత, ప్రమాణాలు దేశాన్ని బట్టి ఎంతగా మారుతున్నాయో చెప్పడానికి కోకాకోలా సంస్థకు చెందిన 'ఫాంటా' కూల్ డ్రింక్ ఒక నిలువెత్తు నిదర్శనం. లండన్‌లో దొరికే ఒక డబ్బా ఫాంటాలో కేవలం 63 కేలరీలు మాత్రమే ఉంటే.. భారత్‌లో లభించే ఫాంటాలో ఏకంగా 3 రెట్లు అధికంగా చక్కెర, హానికరమైన రంగులు ఉంటున్నాయట. ఒకే కంపెనీ రెండు వేర్వేరు దేశాల ప్రజల ఆరోగ్యంతో ఎలా ఆడుకుంటుందో రాయిటర్స్ తన కథనంలో బట్టబయలు చేసింది.
యూరప్ దేశాల్లో ఆహార పదార్థాలపై వాడే కొన్ని రంగులు ఆరోగ్యానికి హానికరమంటూ అక్కడ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తారు. కానీ మన దేశంలో మాత్రం ఆ కృత్రిమ రంగుల వివరాలను డబ్బా వెనుక భాగంలో ఎవరికీ కంటపడకుండా చిన్నచిన్న అక్షరాలతో ముద్రించి చేతులు దులుపుకోంది కోకాకోలా. విదేశాల్లో కఠినమైన నిబంధనలు పాటిస్తున్న ఈ గ్లోబల్ కంపెనీలు.. భారత్‌లో మాత్రం ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను నీరుగారుస్తున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై స్పష్టమైన పోషకాహార హెచ్చరికలను ముద్రించకుండా నిరోధించడానికి ఈ బడా కార్పొరేట్లు దశాబ్దాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ FSSAI ఈ విషయంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది పోయి.. కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గడం గమనార్హం. భారతీయ వంటకాల్లో ఘాటైన సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేక రుచులు ఉంటాయని, అందుకే పశ్చిమ దేశాల మాదిరిగా రంగుల హెచ్చరిక లేబుల్స్ ఇక్కడ సరిపడవని వింత వాదనను ఫుడ్ డిపార్ట్మెంట్ తెరపైకి తెచ్చింది. మార్చి నెలలో జరిగిన ఒక రహస్య సమావేశంలో కోకాకోలా ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ మిల్లీ భట్టాచార్య మాట్లాడుతూ.. సింబల్స్, ఐకాన్స్ చూసి వినియోగదారులు తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటారనడం హాస్యాస్పదమని, హెచ్చరికలు అనవసరమని వాదించారు. ఆశ్చర్యకరంగా, ఈ లాబీయింగ్‌కు తలొగ్గిన ఫుడ్ రెగ్యులేటర్.. అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం కష్టమంటూ సుప్రీంకోర్టుకు తెలపడం విచారకరకం.
ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో భారతీయుల ఆరోగ్యం తీవ్ర సంక్షోభంలో పడనుంది. 2050 నాటికి భారతదేశంలో ఏకంగా 45 కోట్ల మంది ప్రజలు ఊబకాయం, అధిక బరువు సమస్య బారిన పడే అవకాశం ఉందని 'లాన్సెట్' జర్నల్ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య కార్యకర్తలు రంగంలోకి దిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇజ్రాయెల్ తరహాలో ప్యాకెట్లపై స్పష్టమైన రంగుల హెచ్చరికలు ఉండేలా ఆదేశించాలని కోరారు. పారదర్శకతతోనే ఆరోగ్యకరమైన అలవాట్లు సాధ్యమవుతాయని నిపుణులు వాదిస్తున్నారు. కార్పొరేట్ల కబంధ హస్తాల నుంచి మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి న్యాయస్థానాలు ఎలాంటి చారిత్రక తీర్పునిస్తాయో వేచి చూడాల్సిందే.