యూఏఈ కీలక నిర్ణయం.. 50శాతం ప్రభుత్వ సేవలు ఏఐతోనే..!
ఇంటర్నెట్‌డెస్క్: గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 50శాతం ప్రభుత్వ సేవలు, కార్యకలాపాలు ఏఐతోనే నడుస్తాయని ప్రకటించింది. ఏజెంటిక్ ఏఐ (Agentic AI) వినియోగాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించింది. 2028 నాటికి ఈ మార్పులు తీసుకురానున్నట్లు యూఏఈ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తుమ్ వెల్లడించారు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో కృత్రిమ మేధను వినియోగించే తొలి దేశంగా యూఏఈ నిలవనుంది (Artificial Intelligence). ఏఐ ఇక ఓ సపోర్ట్ టూల్‌గా మాత్రమే కాకుండా ఒక ఎగ్జిక్యూటివ్ పార్ట్‌నర్‌గా మారనుందని ప్రధాని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలు మెరుగుపర్చడానికి, నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ సాంకేతికతను ఉపయోగిస్తామని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగానికి క్లాడ్ మిథోస్ బెడద! ఏజెంటిక్ ఏఐ అంటే.. ఇప్పటివరకూ ఉపయోగిస్తోన్న ఏఐ వ్యవస్థలు సాధారణంగా మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. కానీ ఏజెంటిక్ ఏఐ అంతటితో ఆగదు. ఒక లక్ష్యం ఇస్తే.. దాన్ని సాధించడానికి అవసరమైన దశలను తానే నిర్ణయించుకుని, అవసరమైన చర్యలు తీసుకుని, పని పూర్తయ్యేవరకు ముందుకుసాగుతుంది.
అంటే ఇది కేవలం ‘సమాధానం చెప్పే ఏఐ’ కాదు. ఇప్పటివరకూ ఏఐ ఒక సాధనం (టూల్)లా పనిచేసింది. మనకు అవసరం ఉంటే ఉపయోగించుకునేలా ఉండేది. కానీ ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ.. మనతో కలిసి పనిచేసే సహచరుడిలా మారుతోంది. ఇది అవసరాన్ని అర్థం చేసుకుని, అనేక దశల్లో పని చేసి, కొంతవరకు నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటోంది. ఇది చిన్న మార్పు కాదు.. సహాయక టెక్నాలజీ (Assistant) నుంచి సహకార టెక్నాలజీకి (Collaboration) ప్రయాణమని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.