డిగ్రీకీ ప్రవేశ పరీక్ష..?
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి కూడా ప్రవేశ పరీక్ష ఉంటుందా? సొంతగా ప్రవేశాలు జరుపుకొంటున్న ‘నాన్ దోస్త్’ డిగ్రీ కళాశాలలను గాడిలో పెట్టాలంటే అదే మార్గమా..? దీనిపై ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ సమాలోచనలు చేస్తున్నాయి. సాధారణంగా ఇంటర్ ఫలితాల అనంతరం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) ద్వారా డిగ్రీ ప్రవేశాలకు షెడ్యూల్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తదితరులు సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో మొత్తం 826 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో దోస్త్ ద్వారా సీట్లను భర్తీ చేస్తున్నారు. అదే సమయంలో దాదాపు 70 ప్రైవేట్ కళాశాలలు సొంతంగా ప్రవేశాలు జరుపుకొంటున్నాయి. ఇందులో కొన్ని కళాశాలలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా కనీసం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి తగిన పరిష్కారం కోసం విద్యాశాఖ ప్రయత్నించలేదు.
తాజాగా దీనిపై అధికారులు దృష్టి సారించారు. ప్రవేశ పరీక్షతో కళాశాలలన్నింటినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చేలా చేయాలనుకుంటున్నారు. 2027-28 విద్యా సంవత్సరంలో నాన్ దోస్త్ కళాశాలల సమస్య కొలిక్కి తెస్తామని వారు చెబుతున్నారు. జాతీయ విద్యా విధానం కూడా ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు చేపట్టాలని సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. విధివిధానాల కోసం సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈసారికి దోస్త్ ద్వారానే డిగ్రీ ప్రవేశాలు జరపనున్నారు.
ఒక్క విద్యార్థీ చేరకున్నా..
దోస్త్ పరిధిలోని 826 కళాశాలల్లో 3.77 లక్షల సీట్లున్నాయి. అందులో 1.75 లక్షల సీట్లే నిండుతున్నాయి. 70 కళాశాలల్లో ఒక్క విద్యార్థీ చేరటం లేదు. కొన్ని వందల కోర్సుల్లో ఒక్క సీటూ భర్తీ కావడం లేదు. ఫలితంగా దాదాపు 60% సీట్లు మిగిలిపోతున్నాయి. జీరో ప్రవేశాల కళాశాలలు, కోర్సులను రద్దు చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగకపోవడంతో రద్దు మాటలకే పరిమితమవుతోంది. ఈసారి దీనిపైనా నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు.