ఒంటిమిట్ట ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఒంటిమిట్ట: శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులను, ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ, హనుమంతుడు, రంగ మండపంలో జయవిజయులు, గరుడాళ్వారు, బలిపీఠం, ధ్వజ స్తంభాన్ని, భక్త సంజీవరాయ స్వామి ఆలయాన్ని, పవిత్ర జలాలతో శుద్ధి చేశారు.
రామయ్య క్షేత్రంలో పూజలు చేశారు. అనంతరం సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని గోడలకు లేపనం చేశారు. రామయ్య దర్శనాన్ని ఉదయం 8.30 గంటల నుంచి ఆపేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 11.30 గంటలకు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. డిప్యూటీ ఈవో ప్రశాంతి, డీఈ నాగరాజు, ఆలయ పర్యవేక్షకుడు హనుమంతయ్య, తనిఖీ అధికారి నవీన్ కుమార్ పాల్గొన్నారు.