‘ఖర్గ్’పై సరదాగా మరిన్ని దాడులు చేస్తాం: ట్రంప్ కవ్వించే వ్యాఖ్యలు
ఇంటర్నెట్‌డెస్క్: ఒక పక్క పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చమురుకు ఆయువుపట్టు వంటి ఖర్గ్ ఐలాండ్ (Kharg Island)పై సరదాగా మరిన్ని దాడులు చేస్తామంటూ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖర్గ్ ద్వీపంపై మరిన్ని దాడులు జరగొచ్చని ట్రంప్ అన్నారు. ఇప్పటికే తమ దళాలు జరిపిన దాడుల్లో అక్కడ చాలా భాగం ధ్వంసమైందన్నారు. కానీ, సరదాగా తాము మరికొన్ని సార్లు దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ యుద్ధం మూడో వారానికి చేరుకుంది. ఖర్గ్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇప్పటికే అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో వాటిని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అక్కడి చమురు క్షేత్రాలను మాత్రం టచ్ చేయలేదని వెల్లడించారు.
ఇక యుద్ధం ముగింపునకు సంబంధించి ఒక ఒప్పందం కోసం చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. అయితే, అందుకు ప్రతిపాదించిన షరతులు సరిపోవని అన్నారు. దీంతో యుద్ధం ముగించేందుకు ఇప్పుడు తాను సిద్ధంగా లేనని తేల్చిచెప్పేశారు. కాల్పుల విరమణకు సంబంధించిన నిబంధనలు బలంగా ఉండాలన్నారు. అయితే, అవేంటో చెప్పేందుకు ట్రంప్ నిరాకరించారు.