ముందుంది ముసళ్ల పండుగ: గంభీర్కు దాదా వార్నింగ్
రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించిన తొలి టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్-2026 తో పాటు, చాంపియ్స్ ట్రోఫీ-2025 గంభీర్ ఖాతాలో పడ్డాయి. టీమ్ లో మార్పులు చేర్పులతో గందరగోళానికి గురిచేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. టీ20 కప్ వచ్చాక గంభీర్ మీద ఉన్న ఆరోపణలు దాదాపు తగ్గిపోయాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇచ్చిన వార్నింగ్ చర్చనీయాంశంగా మారింది. ముందుంది ముసళ్ల పండుగ అంటూ హెచ్చరించాడు దాదా. వైట్ బాల్ క్రికెట్ లో భాగంగా 2027 ప్రపంచ కప్ అత్యంత సవాళ్లతో కూడుకున్నదిగా గంగూళీ అభివర్ణించాడు.
గంభీర్ కు అసలైన పరీక్ష 2027లో సౌతాఫ్రికాలో మొదలవుతుంది. అక్కడ పరిస్థితులు గంభీర్ ను టెస్ట్ చేస్తాయి. కానీ అతనికి ఉన్న టీమ్ తో దాన్ని సాధిస్తాడనే నమ్మకం ఉంది.. అంటూ మనీ కంట్రోల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొరియా మజుందార్ తో అన్నాడు దాదా.
ఇండియాకు 2023 వరల్డ్ కప్ ఇప్పటికీ నోటి దాకా వచ్చి చేజారిన ముద్ద లాంటిది. ఎందుకంటే సీజన్ మొత్తం అద్భుతంగా రాణించి.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. ఆ సిరీస్ లో ఇండియా గేమ్ చూసి కప్ మనకేనని ఫ్యాన్స్ భావించారు.
ఒక ప్లేయర్ గా 2011 వరల్డ్ కప్ గెలిచిన గంభీర్.. కోచ్ గా 2027 లో వరల్డ్ కప్ ఎదుర్కోవడం సవాళ్లతో కూడుకున్న విషయమేనని గంగూలీ అన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ అనుభవజ్ఞులు ఉండటం కలిసొచ్చే అంశంగా అభిప్రాయపడ్డాడు.