ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయండి: మంత్రి తుమ్మల
సిద్దిపేట: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు పెట్టుబడి, ఎరువులు అన్నీ అందిస్తున్నామని తెలిపారు. తాను మంత్రిగా వచ్చిన సమయానికి ఆయిల్ పామ్ టన్ను రూ.12వేలు ఉండేదని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి టన్ను ధర రూ.20 వేలకు పైగా పెంచామని చెప్పారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయాలని సూచించారు. ఈ పంటకు నీటి సమస్య, మార్కెట్ సమస్య లేదన్నారు. అన్ని విధాలా రైతులకు లాభాలు ఇచ్చే పంట ఆయిల్ పామ్ అని చెప్పారు. నర్మెట్టలో త్వరలో రైతు మేళా నిర్వహిస్తామన్నారు.