ఆన్‌లైన్‌లోనే గ్యాస్ బుకింగ్.. ఓటీపీ ఉంటేనే సిలిండర్: మంత్రి పయ్యావుల
అమరావతి: గ్యాస్ సరఫరా విషయంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మార్గాలవైపు కూడా దృష్టి సారించి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడులు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. ‘‘ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ సహకరించాలి. ఆందోళనతో ఎక్కువమంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారు. కుటుంబ అవసరాలకు ఏమాత్రం లోటు లేకుండా చేయడానికే మా తొలి ప్రాధాన్యం. పైప్డ్ గ్యాస్ కంపెనీలతోనూ సమావేశమవుతాం. సిలిండర్ బుకింగ్ ఆన్‌లైన్‌లోనే ఉండాలని స్పష్టం చేశాం. సిలిండర్ కావాలంటే ఓటీపీ ఉంటేనే ఇస్తారు. బ్లాక్‌మార్కెటింగ్‌కు తరలిపోకుండా ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్ ఇస్తారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.