FASTag యూజర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ పాస్ రేటు పెంపు.. ఎంతంటే?
జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్షిక టోల్ పాస్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ధరలు అమలులోకి వస్తాయని వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు ఏడాది పాస్ కోసం 3వేల రూపాయలు చెల్లిస్తున్న వాహనదారులు.. ఇకపై వార్షిక పాస్ కావాలంటే 3వేల 075 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో వాహనదారుడిపై నేరుగా 75 రూపాయల భారం పెరగనుంది. ఈ పెంచిన ధరలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు మార్చి 31 లోగా రీఛార్జ్ చేసుకుంటే మాత్రం ప్రస్తుత ధరలే వర్తిస్తాయి.
ఈ యాన్యువల్ పాస్ నిబంధనలలో కూడా కొన్ని కీలక మార్పులు ఉన్నాయి. 3వేల 075 రూపాయలు చెల్లించి తీసుకునే ఈ పాస్.. ఒక ఏడాది పాటు లేదంటే గరిష్టంగా 200 సార్లు టోల్ గేట్లను దాటడానికి మాత్రమే అనుమతిస్తుంది. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తయితే అది వర్తిస్తుంది. అంటే ఒకవేళ వాహనదారుడు ఏడాది పూర్తికాకముందే 200 సార్లు టోల్ ప్లాజాలను దాటేస్తే.. ఆ పాస్ గడువు ముగిసినట్లే. అప్పుడు మళ్లీ కొత్త పాస్ కొనుక్కోవాల్సిందే. టోల్ రుసుములను ప్రతి ఏటా సమీక్షించడం సహజమని.. అందులో భాగంగానే ఈ స్వల్ప పెంపును చేసినట్లు మోడీ ప్రభుత్వం పేర్కొంది.
NHAI ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలకు, సంబంధిత అధికారులకు ఈ మార్పులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి పెంచిన ధరలను వసూలు చేయాలని, ఈ సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగానే తెలియజేయాలని సూచించింది. హైవేలపై నిరంతరం ప్రయాణించే వారికి వార్షిక పాస్‌లు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే తాజా ధరల పెంపుతో సామాన్య వాహనదారులపై అదనపు భారం పడనుంది.