గిరిపుత్రుల మధ్య పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్
పాడేరు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటిస్తున్నారు. ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడక వెళ్లారు. అనంతరం రోడ్డు పనులు పరిశీలించారు. జనసేన పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఓనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పవన్ వెంట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంటు ఇంఛార్జి గంగులయ్య, నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా అరకులో ఉన్న గ్రామదర్శిని మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. పవన్ సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓనూరులో అంగన్వాడీ సెంటర్‌ను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం అందించారు.
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయమన్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు సీఎం శుభాభినందనలు తెలిపారు. పవన్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఏడు సిద్ధాంతాలతో ప్రజాజీవితాల్లో భాగం కావడం సంతోషమన్నారు.