అసెంబ్లీలో సీఎం వరుస భేటీలు..కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలతో సమావేశమై తాతా మధు ఘటనపై ఆరా
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలోని తన చాంబర్‌లో వరుస భేటీలు నిర్వహించారు. ముందుగా తాతా మధు.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పులను తెప్పించుకొని పరిశీలించారు. తర్వాత కొందరు మంత్రులతో సమావేశమైన సీఎం... సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఆ వెంటనే కాంగ్రెస్‌కు చెందిన ఎస్సీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తాతా మధు వ్యాఖ్యలపై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు.
అసెంబ్లీ ప్రధాన గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొడవ, పోలీసులతో వాగ్వాదం వంటి ఘటనలపై ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్, హైదరాబాద్ సీపీ సజ్జనార్, డీసీపీ శిల్పవల్లి, ఇతర అధికారులతో సీఎం భేటీ అయ్యి, జరిగిన ఘటనలపై ఆరా తీశారు. పోలీసులపై దాడి చేయడం, వాళ్ల విధులకు ఆటంకం కలిగించినట్లు తెలుసుకొని నిందితులపై చట్టపరమైన చర్యలకు ఆదేశించినట్లు తెలిసింది