Select Location
All Locations
State
Region
City / District
IPL 2026: ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. రన్నరప్‌తోపాటు హైదరాబాద్‌కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

IPL 2026: ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. రన్నరప్‌తోపాటు హైదరాబాద్‌కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 మహా సంగ్రామం ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విజేతగా అవతరించింది. ఈ అద్భుత విజయంతో ట్రోఫీని ముద్దాడటమే కాకుండా, ఆర్సీబీ జట్టు భారీగా ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌తో పాటు మిగిలిన జట్లకు దక్కిన ప్రైజ్ మనీని ఓసారి చూద్దాం..

ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ పీఠాన్ని అధిరోహించింది. టోర్నీ చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లు సాధించిన మూడో జట్టుగా చరిత్ర సృష్టించిన ఆర్సీబీకి బీసీసీఐ భారీ నజరానా అందించింది. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టు ఏకంగా రూ. 20 కోట్ల సింహభాగాన్ని ప్రైజ్ మనీ రూపంలో కైవసం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచి తృటిలో కప్పు చేజార్చుకున్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ. 12.5 కోట్ల నగదు బహుమతి లభించింది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఫైనల్ చేరలేకపోయిన మరికొన్ని జట్లు కూడా కోట్ల రూపాయలను ఆర్జించాయి. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఓటమిపాలై మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ. 7 కోట్ల భారీ నగదు లభించింది. అదేవిధంగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది.

లక్షలాది మంది అభిమానులతో కిక్కిరిసిపోయిన స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఊదేశింది. గుజరాత్ జట్టులో వాషింగ్టన్ సుందర్ కేవలం 37 బంతుల్లో వీరోచిత హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో రాసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లతో చెలరేగగా, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే గుజరాత్‌ను గట్టి దెబ్బ కొట్టారు.


TV9 Telugu 1 month ago
Home Flash News