క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు హస్తినలో వాడీవేడిగా సాగుతున్నాయి. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో.. ఇవాళ ఇందిరాభవన్‌లో అధిష్టానం పెద్దలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు భేటీ అయ్యారు. సమావేశంలో వాళ్లు కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంతరం బయటకు వచ్చిన వాళ్లిద్దరూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
కాగా, గత డిసెంబరు నుంచి(రెండున్నరేళ్లు అధికారం పూర్తి కావడం) సీఎం కుర్చీ కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇరువురూ ఢిల్లీకి వెళ్లి మంతనాలు సాగించారు. అయితే.. మే 20తో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తి కానుంది. పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే, తననే కొనసాగించాలని సిద్ధరామయ్య కోరుతున్నట్లు సమాచారం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మరో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వీళ్లిద్దరి నుంచి అభిప్రాయసేకరణ చేశారు.