Pawan Kalyan | కుల రాజకీయాలు, విమర్శలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. “భరిస్తాం.. అవసరమైతే తాట తీస్తాం”
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పలు కీలక అంశాలపై స్పందించారు. రాష్ట్ర రాజకీయాలు, కుల వివాదాలు, తనపై వస్తున్న విమర్శలు, ప్రత్యర్థుల ఆరోపణలు, పార్టీ భవిష్యత్తు వంటి అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. తనను తరచూ కుల రాజకీయాలతో ముడిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. తాను ఎప్పుడూ తనను కుల నాయకుడిగా ప్రకటించుకోలేదని స్పష్టం చేశారు. “నేను ఎప్పుడైనా నేను కుల నాయకుడిని అని చెప్పానా? మిగతా పార్టీ నేతలు కులం గురించి మాట్లాడటం లేదా?” అంటూ ప్రశ్నించారు. సమాజంలో కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ధోరణి ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో పక్క రాష్ట్ర రాజకీయాలతో పోలికలు తీసుకురావడంపై కూడా పవన్ స్పందించారు. తమిళ రాజకీయాలను ప్రస్తావిస్తూ సరదాగా వ్యాఖ్యానించారు. అక్కడ రాజకీయాలు చాలా సాఫీగా సాగినట్లు కనిపిస్తాయని, కటౌట్లు, ప్రచారంతోనే విజయాలు సాధించినట్లు అనిపిస్తుందని అన్నారు. అయితే తాను మాత్రం ఈ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డానని గుర్తు చేసుకున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంపై వస్తున్న ప్రచారంపై కూడా పవన్ ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలను అరెస్టు చేయాలని తాను కోరినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. “నేను కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన విషయాలు బయటకు ఎలా వస్తాయి? ఒక నాయకుడు జైలుకు వెళ్తే జనసేన ఎదుగుతుందా?” అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం వంటి అంశాల గురించే కేంద్ర నాయకులతో చర్చిస్తామని, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా తన రాజకీయ ప్రయాణంపై కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, తాను బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకే సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై వ్యక్తిగత విమర్శలు చేసే వారికి గట్టి హెచ్చరిక కూడా చేశారు. “నేనూ మనిషినే.. నాకు కోపం, బాధ, భావోద్వేగాలు ఉంటాయి. చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. భరిస్తాం, సహిస్తాం.. అవసరమైతే తాట తీస్తాం” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.