Select Location
All Locations
State
Region
City / District
ఆశల పల్లకీలో రేవంత్‌...

ఆశల పల్లకీలో రేవంత్‌...

తెలంగాణకు 2034 వరకూ తానే ముఖ్యమంత్రిని అని రేవంత్‌ రెడ్డి చెప్పుకోవడం ఆయన ధీమాకు నిదర్శనం కావచ్చు కానీ... వాస్తవమవడం మాత్రం చాలా పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీల్లో. బలహీనంగా ఉన్న అధిష్టానం తన జోలికి రాదని రేవంత్‌ అనుకోవచ్చునేమో కానీ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. రేవంత్‌ ప్రకటనలో ఇంకో విశేషం ఉంది. 2034 తరువాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, తన అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తానని కూడా చెప్పుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎంపీగా రేవంత్‌ తరచూ తాను ఎప్పటికైనా సీఎం అవుతానని చెప్పేవారు. అందరూ తేలికగా తీసుకున్నా ఏపీ విభజనతో ఆయన దశ తిరిగిందని అనుకోవాలి.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతినిపోవడం అధినేత చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్‌లో చేరడం ఆయనకు కలిసివచ్చింది. కాంగ్రెస్‌లో కీలకమైన పదవులు, పీసీసీ అధ్యక్ష స్థానం సులువుగానే దక్కాయి. ఇదంతా ఆయన తన సొంత స్టైల్లో సాధించారు. అంతవరకు వాస్తవమే. నిజానికి ఓటుకు నోటు కేసు వల్ల కొంత ఇబ్బంది పడినా తదుపరి పరిణామలు ఆయనకు అనుకూలంగా మారాయి. చంద్రబాబు హుటాహుటిన విజయవాడ వెళ్లిపోవడం, తెలంగాణలో టీడీపీని పూర్తిగా వదలివేయక తప్పని స్థితి ఏర్పడడం, రేవంత్‌ను జాగ్రత్తగా చూసుకోవల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉండటం వంటి కారణాలు కీలకంగా కనిపిస్తాయి. దానికి తోడు దూకుడుగా రాజకీయం చేయడం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు, తీవ్రమైన పరుష భాషలో విమర్శలు చేయడం, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ ఈ స్థాయిలో ప్రజలలోకి వెళ్లలేకపోవడం వంటి కారణాలు కలిసి వచ్చాయి. మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు మంత్రులలుగా సర్దుకోక తప్పలేదు. ఎంపీగా ఉండగా రేవంత్ కాంగ్రెస్ హై కమాండ్‌తోదగ్గరి సంబంధాలు పెట్టుకగలిగారు. పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ చేయగలుగుతారన్న విశ్వాసాన్ని ఇవ్వగలిగారు.


Sakshi 1 hour ago
Home Flash News