Select Location
All Locations
State
Region
City / District
ఫ్రాంచైజీని కొనేసిన రాహుల్‌ ద్రవిడ్‌

ఫ్రాంచైజీని కొనేసిన రాహుల్‌ ద్రవిడ్‌

భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఇప్పటికే ఆటగాడిగా, కోచ్‌గా సక్సెస్‌ సాధించిన అతడు.. తాజాగా ఓ క్రికెట్‌ ఫ్రాంచైజీ యజమానిగా మారాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో డబ్లిన్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కులను చేజిక్కించుకున్నాడు. ఈ విషయంపై నిన్న అధికారిక ప్రకటన వెలువడింది. ఈ జట్టుకు "Dublin Guardians" అని పేరు పెట్టారు.

యూరప్‌లో తొలిసారి క్రాస్-బోర్డర్ ఫ్రాంచైజీ మోడల్‌తో ప్రారంభమవుతున్న ఈ లీగ్‌కు బాలీవుడ్ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా డబ్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో ద్రవిడ్, అభిషేక్ బచ్చన్ ఇద్దరూ పాల్గొన్నారు. ఈ టోర్నీని క్రికెట్‌ ఐర్లాండ్‌, క్రికెట్‌ స్కాట్లాండ్‌ మరియు రాయల్‌ డచ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. డబ్లిన్, బెల్‌ఫాస్ట్, ఎడిన్‌బర్గ్, గ్లాస్గో, ఆమ్‌స్టర్‌డామ్, రోటర్‌డామ్ నగరాలకు చెందిన ఆరు ఫ్రాంచైజీ ఈ లీగ్‌లో పోటీ పడనున్నాయి. డబ్లిన్‌ యజమాన్య హక్కులను చేజిక్కించుకున్న సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. 

యూరప్‌లో క్రికెట్ అభివృద్ధి, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం అనే పెద్ద విజన్ తనను ఆకర్షించిందని తెలిపాడు. డబ్లిన్‌లో ఇప్పటికే మంచి క్రికెట్ కమ్యూనిటీ ఉంది. యువ ప్రతిభను ప్రోత్సహించడం నాకు ఎప్పుడూ ముఖ్యమే. ETPL ఆ దిశగా కీలక పాత్ర పోషించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ETPLలో పలువురు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశముంది. అందులో మిచెల్‌ మార్ష్‌, టిమ్‌ డేవిడ్‌, మిచెల్‌ సా​ంట్నర్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో రాహుల్‌ ద్రవిడ్‌తో పాటు మరికొంతమంది మాజీ క్రికెటర్లు కూడా యాజమాన్య హక్కులను పొందారు. మ్యాక్స్‌వెల్‌ బెల్‌ఫాస్ట్‌, కైల్‌ మిల్స్‌, నాథన్‌ మెక్‌కల్లమ్‌ ఎడిన్‌బర్గ్‌, క్రిస్‌ గేల్‌ గ్లాస్గో, స్టీవ్‌ వా అమ్‌స్టర్‌డామ్‌, జాంటీ రోడ్స్‌, డుప్లెసిస్‌ రోటర్‌డామ్‌ ఫ్రాంచైజీలకు యాజమానులుగా ఉన్నారు.


Sakshi 29 days ago
Home Flash News