No Dues Certificate పొందడం ఎందుకు ముఖ్యం?
చాలా మంది అనేక రకాల రుణాలను తీసుకుంటుంటారు. రుణం తీసుకున్న తర్వాత కొన్నేళ్ళకి రుణాన్ని పూర్తిగా చెల్లించేస్తారు. మీరు చివరి ఈఎంఐ చెల్లించిన తర్వాత, మీ రుణ ప్రయాణం ముగిసిందని అనుకుంటారు. అయితే, అది పాక్షికంగా మాత్రమే నిజం. ఎందుకంటే, రుణం పూర్తిగా చెల్లించేసిన తర్వాత బ్యాంకు నుంచి రుణానికి సంబంధించి ఎలాంటి బకాయిలు లేవని ధ్రువీకరణ పత్రం(No Dues Certificate)ను పొందడం అనే ఒక ముఖ్యమైన దశ ఇంకా మిగిలే ఉంటుంది. దీన్ని ఎలా తీసుకోవాలి, NDC తీసుకోవడం వల్ల ప్రయోజనాలేంటి, తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులేంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. No Dues Certificate(NDC) ఇది చివరి EMI చెల్లింపు తర్వాత బ్యాంకు రుణగ్రహీతకు జారీ చేసే ఒక అధికారిక రసీదు. ఇది రుణగ్రహీత తన బకాయిలన్నింటినీ తిరిగి చెల్లించారని ధ్రువీకరిస్తుంది. బకాయిలు పూర్తిగా తీర్చేసారని బ్యాంకు NDC జారీ చేయడంతో రుణం అధికారికంగా ముగిసినట్లు అవుతుంది.
నో డ్యూస్ సర్టిఫికేట్..రుణగ్రహీత వైపు నుంచి ఎటువంటి బకాయిలు లేవని స్పష్టంగా తెలియజేస్తుంది. భవిష్యత్తులో రుణానికి సంబంధించి బ్యాంకు ఏదైనా వివాదాన్ని లేవనెత్తిన పక్షంలో ఇది రుణగ్రహీతకు రక్షణ కల్పిస్తుంది. క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఈ NDC రుణగ్రహీతల క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. రుణగ్రహీత రుణాన్ని పూర్తిగా చెల్లించేసిన తర్వాత, బ్యాంకు ఆ విషయాన్ని క్రెడిట్ సంస్థలకు నివేదిస్తుంది. దీంతో క్రెడిట్ బ్యూరో రుణగ్రహీతకు సంబంధించిన క్రెడిట్ రిపోర్ట్‌లో రుణానికి సంబంధించిన వాస్తవ స్థితిని నవీకరిస్తుంది. దీనివల్ల రుణగ్రహీతకు సంబంధించిన రుణ అర్హత పెరిగి, అతని క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుంది. బకాయిలు క్లియర్‌గా ఉండడం వల్ల రుణగ్రహీత భవిష్యత్తులో రుణాలు పొందడం మరింత సులభమవుతుంది. NDC లేకపోతే.. రుణాన్ని పూర్తిగా తీర్చేసిన తర్వాత ఈ NDC పొందడం అంత ముఖ్యం కాదని, దానిని వదిలేయవచ్చని కొంతమంది అనుకోవచ్చు.
ఈ పత్రాన్ని తప్పక తీసుకోవాలి. రుణం తీర్చిన తర్వాత ఈ పత్రం తీసుకోకపోవడం వల్ల చట్టపరంగా, ఆర్థికంగా మీకు తీవ్రమైన పరిణామాలు ఎదురవ్వొచ్చు. మీకు NDC లేకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అవేంటంటే.. భవిష్యత్ రుణాలకు ఆటంకం క్రెడిట్ స్కోరు మీ రుణ అర్హతను నిర్ధారిస్తుంది. ఇంకా, మీ రుణ చెల్లింపుల చరిత్ర, ప్రవర్తనను చూపుతుంది. బ్యాంకులు మీ రుణ అర్హతను, వడ్డీ రేటును అంచనా వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. మీకు NDC లేకపోతే, క్రెడిట్ బ్యూరోల రికార్డుల్లో మీ రుణ ఖాతా ఇంకా క్లోజ్ అయినట్లుగా ఉండదు. ఇది మీ క్రెడిట్ స్కోరును, కొత్త రుణాలు పొందే అవకాశాలను తగ్గేలా చేస్తుంది. భవిష్యత్తులో మీకు వేరే రుణం అవసరం పడినప్పుడు మీ మునుపటి రుణానికి సంబంధించిన NDC సమర్పించకపోతే, కొన్ని బ్యాంకులు మీ రుణ దరఖాస్తును పరిగణనలోకి కూడా తీసుకోకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు బ్యాంకు నుంచి మీకు NDC అందకపోతే, మీరు ఇప్పటికే చెల్లించిన రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించమని మిమ్మల్ని అడిగే అవకాశాలున్నాయి.
ఎందుకంటే మీ రుణ ఖాతా క్లోజయినట్లుగా ఉండదు. దీనివల్ల బ్యాంకు మీకు వడ్డీ, జరిమానాలను చెల్లించమని కోరవచ్చు. ఇది గందరగోళానికి, ఆర్థిక నష్టానికి దారితీసేలా చేస్తుంది. అంతేకాకుండా, మీ రుణ చెల్లింపులపై మీరు క్లెయిమ్ చేసిన పన్ను మినహాయింపుల ప్రయోజనాలను కూడా మీరు కోల్పోవచ్చు. చట్టపరమైన ఇబ్బందులు మీరు రుణం పూర్తిగా చెల్లించి కూడా NDC పొందనట్లయితే చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. NDC లేకపోతే, బ్యాంకులకు మీరు బకాయిలు పూర్తిగా చెల్లించారని నిరూపించడానికి మీ వద్ద ఎటువంటి చట్టపరమైన రుజువు ఉండదు. మీరు ఇంకా వారికి డబ్బు బాకీ ఉన్నారని రుణ సంస్థ వాదించి, మీపై చట్టపరమైన చర్యలను కూడా ప్రారంభించవచ్చు. ఇలాంటివి మీకు చాలా మానసిక ఒత్తిడిని, ఇబ్బందిని కలిగిస్తాయి. మీ దగ్గర రుణ క్లియరెన్స్‌కు సంబంధించిన NDC లేకపోతే బ్యాంకుకు మీరు పెట్టిన తాకట్టు ఆస్తులపై హక్కు(Lien) ఉండవచ్చు.
కాబట్టి, రుణం కోసం హామీగా తాకట్టు పెట్టిన మీ ఆస్తిని బదిలీ చేయడంలో లేదా విక్రయించడంలో కూడా మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. NDC ఎలా పొందాలి? రుణగ్రహీత చివరి ఈఎంఐ చెల్లించిన తర్వాత, బ్యాంకు అతని రుణ ఖాతాను మూసివేసి, మెయిల్ ద్వారా లేదా కొరియర్ ద్వారా లేదా రెండింటి ద్వారా బకాయిలు లేవని No Dues Certificate జారీ చేస్తుంది. ఒకవేళ, రుణగ్రహీతకు ఈ సర్టిఫికేట్ అందకపోతే, వారు నెట్ బ్యాంకింగ్ ద్వారా NDC కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణగ్రహీతలు అవసరమైన పత్రాలతో పాటు బ్యాంకు శాఖలో నేరుగా కూడా దీని కోసం దరఖాస్తును సమర్పించవచ్చు. మీ రుణ ఖాతాను మూసివేసిన తర్వాత వీలైనంత త్వరగా NDC కోసం దరఖాస్తు చేసుకోండి. బ్యాంకు దాన్ని మీకు స్వయంగా పంపే వరకు వేచి ఉండకండి. రుణాన్ని పూర్తిగా చెల్లించాక, మీరు NDC ఎంత త్వరగా పొందితే అంత మంచిది.