అమెరికాతో ఒప్పందం..ఇప్పట్లో కుదిరేలా లేదు: ఇరాన్
ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేయడంతో అమెరికా-ఇరాన్ (Iran-US) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ (Mohammad Bagher) కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంతో జరుగుతున్న శాంతి చర్చల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ తుది ఒప్పందం ఇప్పట్లో కుదిరేలా లేదని..అది చాలా దూరంలో ఉందని అభివర్ణించారు. చర్చల్లో చాలా అంతరాలు కొనసాగుతున్నాయని.. పలు ప్రాథమిక అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయని తెలిపారు. వారాల తరబడి జరిగిన యుద్ధంలో ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించిందన్నారు.
తమ డిమాండ్లను అగ్రరాజ్యం అంగీకరించినందుకే తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించామని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యాలను అమెరికా సాధించలేకపోయిందని మహమ్మద్ బఘేర్ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి ఇప్పటికీ, ఎప్పటికీ ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందన్నారు. తమపై పలు డిమాండ్లను రుద్దడానికి శత్రువులు ప్రయత్నించారని.. అందుకు తాము అంగీకరించకపోవడంతో చర్చలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీ ఖరారు కాలేదన్నారు.
ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని.. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అనంతరం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హర్మూజ్‌ని దాటేందుకు యత్నించిన భారతీయ నౌకలపై కాల్పులు శనివారం వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ..హర్మూజ్ విషయంలో ఇరాన్ అతి చేస్తోందని విమర్శించారు. జలసంధిని తిరిగి తెరిపించడానికి సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.