India | అమెరికా యూ టర్న్.. రష్యా నుంచి చమురు కొనేందుకు మళ్లీ అనుమతి.. ఇండియాకు ఊరట
India : చమురు సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న దేశాలకు ఊరటనిచ్చేలా అమెరికా నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలకు అమెరికా అనుమతినిచ్చింది. ఇది ఇండియా సహా అనేక దేశాలకు ఊరట కలిగించే విషయం. గతంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షల్ని అమెరికా విధించింది. అనంతరం ఇరాన్ యుద్దం నేపథ్యంలో ఆంక్షల్ని సడలించింది. తిరిగి మళ్లీ ఆంక్షలు విధించింది.
ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని, రష్యా నుంచి చమురు కొనుగోలుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. మే 16 వరకు ఈ నిర్ణయం వర్తిస్తుందని అమెరికా తెలిపింది. అయితే, కొత్తగా చమురు కొనుగోలుపై కాకుండా, ఇప్పటికే సముద్రంపై రవాణాలో ఉన్న చమురును కొనుగోలు చేసేందుకే ఈ అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం ఇండియాకు మేలు చేస్తుంది. ప్రస్తుతం గల్ఫ్ సంక్షోభం కారణంగా చమురు రవాణా నిలిచిపోయింది. హార్ముజ్ జలసంధి తెరిచినప్పటికీ చమురు రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఇండియాకు చాలా కీలకం. మరోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గాయి.