ఎన్డీయేకు చీకటి రోజు.. వారికి తొలి ఓటమి: ప్రియాంకా గాంధీ
ఇంటర్నెట్‌డెస్క్: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) స్పందించారు. ఇది డీలిమిటేషన్, మహిళల హక్కుల కోసం తీసుకొచ్చిన బిల్లు కాదన్నారు. విపక్షాలన్నీ ఏకతాటి పైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. ఎన్డీయేకు ఇది చీకటి రోజు అని, వారు తీసుకొచ్చిన బిల్లు తొలిసారిగా లోక్‌సభలో ఓడిపోయిందని విమర్శించారు.
లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుల విషయంలో ఫలితంతో సంబంధం లేకుండా తమకే ఘనత దక్కేలా అధికారపక్షం ఎత్తుగడ వేసిందని దుయ్యబట్టారు. ‘‘బిల్లు ఆమోదం పొందినా.. పొందకపోయినా అది తమకు విజయమేనని వారు విశ్వసించారు. మహిళల హక్కుల కోసం పోరాడేది తామేనని నమ్మించాలనుకున్నారు. కానీ అది అంత సులభం కాదు’’ అని ప్రియాంక అన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని ఆమె ప్రశ్నించారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం పేరిట వ్యవస్థలపై ఏమాత్రం గౌరవం లేకుండా అధికారపక్షం వ్యవహరించిన తీరును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. ‘‘ఇది ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. ఆ కూటమి కుదుపునకు లోనయింది’’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కేంద్రానికి సవాలు విసిరారు. ‘‘2023లో ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకురండి. అందుకోసం సోమవారం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి. దానికి మా పూర్తి మద్దతు తప్పకుండా ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది.. మహిళా వ్యతిరేకులు ఎవరో’’ అని ప్రియాంక పేర్కొన్నారు.