రూ.9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ మధ్య రైల్వే లైన్లు
దిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్టులు, విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గాజియాబాద్-సీతాపూర్ మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. రాజమండ్రి-విశాఖ మధ్య మొత్తం 198 కి.మీ మేర రూ.9,889 కోట్లతో మరో రెండు రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిడదవోలు-దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉన్న చెన్నై-హౌడా మధ్య ఈ సెక్షన్‌లో నాలుగు లైన్లు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ఏపీలోని తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలను కవర్ చేస్తుంది.
తూర్పు తీరంలోని విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు మార్గం తూర్పు తీరంలోని అత్యంత రద్దీగా ఉండే, సరకు రవాణా అధికంగా జరిగే మార్గాల్లో ఒకటిగా ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ మార్గం సామర్థ్యం ఇప్పటికే 130 శాతానికి చేరుకోవడంతో.. తరచూ రద్దీ, ఆలస్యం పెరుగుతోంది. ప్రతిపాదిత పోర్టులు, పరిశ్రమల విస్తరణ కారణంగా లైను సామర్థ్యం మరింత పెరగనుంది. ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 4.3 కి.మీ రైలు వంతెన, 2.67కి.మీ వయాడక్ట్, 3 బైపాస్‌ల నిర్మాణం జరగనుంది.