అమెరికా యుద్ధ విమానాన్ని నడిపిన ఐఏఎఫ్ చీఫ్
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా పర్యటన సందర్భంగా భారత వైమానిక దళం (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ (Amar Preet Singh) ఎఫ్-15 ఈఎక్స్ ఈగల్-II యుద్ధ విమానాన్ని నడిపారు. నెవడా వైమానిక స్థావరంలో యూఎస్ వైమానిక దళ మేజర్ మాథ్యూ బెన్సన్‌తో కలిసి అమర్ ప్రీత్ సింగ్ యుద్ధ విమానాన్ని నడుపుతున్న ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఎఫ్-15ను నడపడం ద్వారా ఆ విమాన సామర్థ్యాలను, ఆధునిక యుద్ధాల్లో దాని పాత్రను అమర్ ప్రీత్ సింగ్ మరింత అర్థం చేసుకోగలిగారని అమెరికా సైనిక అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా ఐఏఎఫ్ చీఫ్.. అమెరికా వైమానిక దళ యుద్ధ కేంద్రం కమాండర్ బ్రిగేడియర్ జనరల్ డేవిడ్ సి ఎప్పర్సన్తో సహా ఆ దేశ వైమానిక దళంలోని సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు.
ఏప్రిల్ 10న జరిగిన ఈ భేటీలో ఇరుదేశాల వైమానిక దళాల మధ్య సంయుక్త విన్యాసాలను విస్తరించడం, అధునాతన సాంకేతికతలు, యుద్ధ వ్యవస్థలపై పరస్పర అవగాహనను పెంచుకోవడం వంటి వాటిపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళం మరిన్ని ఆధునిక ఆయుధాలను పొందే ప్రయత్నాలకు తమ వైమానిక దళం మద్దతుగా ఉంటుందని యూఎస్ జనరల్ విల్స్‌బాచ్ పేర్కొన్నారు. అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఎఫ్-15 ఈఎక్స్ ఈగల్-II ఒకటి. దీనిని బోయింగ్ సంస్థ తయారుచేసింది. ఇరాన్‌పై దాడులు చేయడానికి అగ్రరాజ్యం ఈ విమానాలనే వినియోగించింది. ఈ విమానం మాక్ 2.5 గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. 13,381 కిలోగ్రాముల వరకు పేలోడ్‌ను మోయగలదు. ఇదీ చదవండి: తెరచినా ఊరటే కానీ.. లబ్ధి ఇప్పుడే కాదు!