మహిళా బిల్లు ఇప్పుడు ప్రవేశ పెట్టడం వెనుక ఉద్దేశం వేరే ఉంది: కేసీ వేణుగోపాల్
లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు, హోంమంత్రి అమిత్ షా మధ్య మాటల యుద్ధం నడిచింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశం వేరే ఉందని వేణుగోపాల్ అన్నారు. రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం హైజాక్ చేస్తోందని విమర్శించారు. భారత సమాఖ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. ఈ బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి..? అని ప్రశ్నించారు. 2023లోనే మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చామని చెప్పారు. 2024 నుంచే అమలు చేయమని డిమాండ్ చేశాం..
కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు 2024లో ఎందుకు అమలు చేయలేదో చెప్పాలి.. అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బిల్లును ఆగమేఘాల మీద ఇప్పుడు ప్రవేశ పెట్టడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ బిల్లును ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఇన్నాళ్లుగా ఎటుపోయిందని ప్రశ్నించారు.