భారత్-అమెరికా మధ్య మళ్లీ వాణిజ్య చర్చలు..!
ఇంటర్నెట్‌డెస్క్: భారత్- అమెరికా (Indian-USA) మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారత అధికార ప్రతినిధి బృందం వచ్చేవారం అగ్రరాజ్యానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికార వర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా- భారత్ మధ్య ఇప్పటికే తాత్కాలిక వాణిజ్యఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. తాజా చర్చల్లో ఈ ఒప్పందంపై ఇరుదేశాలు ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేయనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఈ ఒప్పందంపై మార్చిలోనే సంతకాలు చేయాలని గతంలో ఇరుదేశాలు అనుకున్నాయి. అయితే, అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాలపై విధించిన టారిఫ్‌లు (Trump tariffs) చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పు నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. తాజాగా వీటిని పునరుద్ధరించేందుకు ఇరుదేశాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జులై నుంచి మళ్లీ ట్రంప్ టారిఫ్‌లు: స్కాట్ బెసెంట్ ఈ ఏడాది జులై ఆరంభం నుంచి టారిఫ్‌లను పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ (Scott Bessent) తెలిపారు. ట్రంప్ టారిఫ్‌లు చట్టవిరుద్ధమంటూ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తాము తగ్గమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం సెక్షన్ 301 ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. ఈ చట్టం కింద విధించే సుంకాలకు ఇప్పటికే న్యాయపరమైన గుర్తింపు ఉందన్నారు.