Asim Munir | ఇరాన్ నేతలను యుద్ధ దుస్తుల్లో, జేడీ వాన్స్‌ను సూట్‌లో కలిసిన అసిమ్ మునీర్.. ఎందుకంటే?
ఇస్లామాబాద్: యుద్ధంతో ఉద్రిక్తతలు పెంచిన అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ నేతలు ఆ దేశానికి చేరుకున్నారు. అయితే పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కాకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (Asim Munir) ఇరు దేశాల ప్రతినిధులకు స్వాగతం పలకడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబాఫ్, ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ నేతృత్వంలోని 71 మంది సభ్యుల ప్రతినిధి బృందానికి అసిమ్ మునీర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యుద్ధ దుస్తులైన కంబాట్ డ్రెస్‌లో ఆయన కనిపించారు.
కాగా, కొన్ని గంటల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి చేరుకున్నది. ఈ సందర్భంగా అసిమ్ మునీర్ సూటు, బూటు ధరించి వారికి స్వాగతం పలికారు. అయితే ఇరాన్, అమెరికా ప్రతినిధుల స్వాగతం సమయంలో అసిమ్ మునీర్ ఇలా విభిన్న డ్రెస్‌లో కనిపించడం, ప్రోటోకాల్‌ను పాక్ పాటించకపోవడం చర్చనీయాంశమైంది.
మరోవైపు జేడీ వాన్స్‌ను కలిసిన సందర్భంగా నల్ల సూటు ధరించిన అసిమ్ మునీర్, తనను తాను రాజనీతిజ్ఞుడిగా చూపించుకునేందుకు ప్రయత్నించినట్లు రాజకీయ నిఫుణులు భావిస్తున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం సందర్భంగా కూడా మునీర్ సూటు ధరించారు.
తనకు ‘అత్యంత ఇష్టమైన ఫీల్డ్ మార్షల్’ అని ట్రంప్ ఆయనను ప్రశంసించారు.
అయితే 2024లో క్షిపణి దాడులు, సరిహద్దు ఘర్షణలతో ఇరాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అసిమ్ మునీర్ ఉద్దేశపూర్వకంగానే ఇరాన్ ప్రతినిధులకు కంబాట్ డ్రెస్‌లో స్వాగతం పలికినట్లు రాజకీయ నిఫుణులు భావిస్తున్నారు. అమెరికాతో దోస్తీ, ఇరాన్‌కు హెచ్చరిక సందేశాన్ని ఆయన ఇచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు.
అలాగే పాక్ అధికార కేంద్రంలో తానే కీలకమన్న సందేశాన్ని ఆ దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి కూడా అసిమ్ మునీర్ ఇలా తెలియజేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: