Select Location
All Locations
State
Region
City / District
శాంతి చర్చల వేళ రెడ్‌జోన్‌కు సీల్‌..హై అలర్ట్‌లోకి పాక్‌..!

శాంతి చర్చల వేళ రెడ్‌జోన్‌కు సీల్‌..హై అలర్ట్‌లోకి పాక్‌..!

US-Iran talks| ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా-ఇరాన్‌ (USA-Iran) కాల్పుల విరమణకు అంగీకరించినా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తొలగిపోలేదు. సీజ్‌ఫైర్ వేళ.. శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఏప్రిల్ 11న రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ భవనాలు, కీలక రహదారి మార్గాల వద్ద భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. రాజధానిలోని రెడ్‌జోన్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. అక్కడ పరిమిత సంఖ్యలోనే జనసంచారం కనిపిస్తోంది.

 ఇస్లామాబాద్‌లో దేశ పార్లమెంట్, కీలక ప్రభుత్వ కార్యాలయాలు, లగ్జరీ హోటళ్లు, ఎంబసీలు, విదేశీ సంస్థల కార్యాలయాలున్న ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా పిలుస్తారు. ఈ చర్చల నేపథ్యంలో గురువారం, శుక్రవారం ఇస్లామాబాద్‌లో సెలవు ప్రకటించారు. దుకాణాలు మూతపడ్డాయి. ఇజ్రాయెల్- పాక్‌ మధ్య మాటల యుద్ధం తమ మధ్యవర్తిత్వంతోనే రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగిందని చెప్పిన పాకిస్థాన్‌ (Pakistan).. ఇప్పుడు ఇరుదేశాల మధ్య శాంతిచర్చలకు ఆతిథ్యం ఇస్తోంది. ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నేతృత్వంలోని బృందం అమెరికా తరఫున చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఇరాన్ వైపు నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ పాక్‌ బయల్దేరారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలను ఇరాన్ ఖండించింది. వారిద్దరూ తమ రాజధాని టెహ్రాన్‌లోనే ఉన్నారని చెప్పింది. ఒకవేళ చర్చలంటూ జరిగితే.. హర్మూజ్‌పై నియంత్రణ, తమ దేశంపై ఉన్న ఆంక్షల నుంచి ఉపశమనం, తన మిత్రపక్షాలపై దాడులు చేయకూడదంటూ 10 పాయింట్ల డిమాండ్ల పైనే ఇరాన్ పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక, లెబనాన్‌లోని ఇరాన్ మిత్రపక్షం హెజ్‌బొల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగడం లేదు. సీజ్‌ఫైర్ ప్రకటన తర్వాతే అక్కడ మారణహోమం సృష్టించింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న అపనమ్మకం, ఇజ్రాయెల్ దూకుడు కారణంగా ఈ చర్చల్లో పురోగతిని ఆశించలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Sakshi 1 month ago
Home Flash News