ట్రంప్ మనసెందుకు మారింది..?
ఇరాన్‌ను సర్వనాశనం చేస్తానని, ఇక గడువు పెంచేది లేదని తీవ్ర స్వరంతో హెచ్చరించిన అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా మనసెందుకు మార్చుకున్నారు?
ఇదే మీకు చివరి రాత్రి అని హూంకరించి.. కొన్ని గంటల్లోనే శాంతిమంత్రం ఎందుకు అందుకున్నారు?
దుర్భాషలతో అవతలివారిపై విరుచుకుపడుతూ అసహనాన్ని వ్యక్తంచేస్తూ వచ్చి ఒక్కసారిగా స్వరాన్ని ఎందుకు సవరించుకున్నారు..?
ఆయన బెదిరింపులు ఫలితాన్ని రాబట్టాయా? కాల్పుల విరమణ ఎన్నాళ్లు కొనసాగుతుంది? పశ్చిమాసియా యుద్ధంలో ఇలాంటివన్నీ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఘర్షణను మరింత పెంచుకోవడం మంచిది కాదని అమెరికాకు నచ్చజెప్పేందుకు పాక్ నేతృత్వంలోని మధ్యవర్తులతోపాటు ఇరాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి- చైనా గట్టి ప్రయత్నాలు చేసింది.
ఒక దేశం మొత్తాన్ని సర్వనాశనం చేస్తానని ట్రంప్ చేసిన హెచ్చరికల్ని అమెరికాలో డెమోక్రటిక్ శాసనకర్తలు తీవ్రంగా ఖండించారు. ఇది నైతిక ఓటమేనని ఆక్షేపించారు. అటు పోప్ లియో సయితం ట్రంప్ తీరును తప్పుబట్టారు. అంతూపొంతూలేని యుద్ధాల నుంచి అమెరికాను బయటకు తీసుకువస్తానని అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికాకు ట్రంప్ హామీ ఇచ్చారు. అది కూడా ఆయన్ని వెనక్కితగ్గేలా చేసిందని భావిస్తున్నారు.
జలసంధిని నియంత్రించడం ఖర్చే
పర్షియన్ గల్ఫ్‌లోని హర్మూజ్ జలసంధిని నియంత్రణలోకి తెచ్చుకోవడం దీర్ఘకాలిక ప్రక్రియే కాకుండా అమెరికాకు ఎంతో ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులో 20% ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. ఇక్కడ పట్టు బిగించాలంటే ఇరాన్ భూభాగంలో దాదాపు 600 కి.మీ.
ప్రాంతంపై అమెరికా సైన్యం నియంత్రణ సాధించాలి. నౌకలపై క్షిపణుల్ని ప్రయోగించకుండా ఇరాన్‌ను ఆపాలంటే 30,000 నుంచి 45,000 మంది సైనికులు అవసరమవుతారు. ఏళ్లతరబడి అంతమందిని అక్కడ ఉంచడం, దానికయ్యే ఖర్చు; గతంలో అఫ్గానిస్థాన్‌లో.. వియత్నాంలో ఇలాంటివాటికి చెల్లించుకోవాల్సిన మూల్యం- అమెరికా పునరాలోచనకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు.
అన్నింటికీ రెండువారాలే!
రెండువారాలు.. ఇది ట్రంప్‌నకు ఇష్టమైన కాలవ్యవధి. ప్రధాన నిర్ణయాలు తీసుకునేముందు ఆయనకు నచ్చే గడువు ఇది. ఇరాన్‌పై దాడుల నిర్ణయానికి వచ్చేముందు ట్రంప్ తీసుకున్న గడువు రెండు వారాలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని అంతం చేస్తానంటూ పలుమార్లు ప్రకటించిన గడువు కూడా రెండు వారాలే. ఆరోగ్య రక్షణపై విధాన నిర్ణయం తీసుకునేందుకూ అంతే సమయం తీసుకున్నారు.