... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
నారీ శక్తికి పట్టం కడదాం

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు పలకండి ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం

జాతీయ ప్రాధాన్యత కలిగిన విషయాల్లో విభేదాలను పక్కన పెట్టి సమైక్యతతో పనిచేయగల సామర్థ్యం తనకు ఉందని భారత్‌ నిరంతరం నిరూపిస్తూనే ఉంది. అలా సమైక్యంగా పనిచేయాల్సిన ఘడియ ఇది. కలిసి ముందుకు సాగుదాం రండి. జాతీయ పురోగతి కోసం నారీశక్తికి సాధికారికత కల్పించి రాజ్యాంగ విలువల్ని బలోపేతం చేద్దాం రండి.. రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల ఆనందోత్సాహాల్లో ప్రజలు మునిగి తేలనున్నారు. ఈ పండుగలు జరుపుకొనే దేశ, విదేశాల్లోని భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈనెల 11న మనం మహాత్మా ఫూలే ద్విశతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నాం. ఈనెల 14న అంబేద్కర్‌ జయంతి సందర్భంగా డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌కు నివాళులు అర్పించనున్నాం. 

మన హృదయాల్లో నవ స్ఫూర్తిని నింపే ఈ ప్రత్యేక సందర్భాలను ఆస్వాదించడంతో పాటు దేశం ఒక చారిత్రక ఘడియ ముంగిట నిలుచుంది. ఇది మన ప్రజాస్వామ్య పునాదుల్ని బలోపేతం చేసే అవకాశాన్ని ఇవ్వడంతోపాటు సమానత్వానికి, సశక్తీకరణకు మనందరం సమష్టిగా కట్టుబడి ఉన్నామని తెలిపే సందర్భాన్ని మన ముందు ఆవిష్కరించనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించే బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపేందుకు మన పార్లమెంటు ఈ నెల 16న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం దేశంలోని కోట్లాది మహిళల ఆకాంక్షలను ప్రతిఫలించనుంది. భారత జనాభాలో సగం మహిళలే. గడచిన కొన్నేళ్లలో మహిళా సాధికారికతకు అనువైన వాతావరణం సృష్టించేందుకు నిరంతర ప్రయత్నాలు జరిగాయి.

 అయినప్పటికీ సమాజంలో మహిళల కీలక స్థానానికి తగిన రీతిలో రాజకీయ ప్రపంచంలో, చట్ట సభల్లో వారి ప్రాతినిధ్యం లేకపోయింది. ఇది చాలా దురదృష్టకరం. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలకు జరిగే శాసనసభ ఎన్నికలన్నిటిలో మహిళా రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలుకావాలి. గడచిన అనేక దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మహిళలకు హక్కుగా దక్కాల్సిన స్థానాన్ని అందించేందుకు పలుమార్లు ప్రయత్నించాయి. కానీ అవేవీ ఫలవంతం కాలేదు. అయితే చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న విషయంపై అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. అదే ఏకాభిప్రాయంతో పార్లమెంటు 2023 సెప్టెంబరులో ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’కు ఆమోదం తెలిపింది. అది నా జీవితంలోని అతి ముఖ్య సందర్భాల్లో ఒకటి.

 మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్‌ కల్పించాలన్న సంకల్పం మన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ఈ ఘడియను మరికొంత కాలం వాయిదా వేసేందుకు వీలు లేదు. చట్టసభల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని దశాబ్దాలుగా అందరూ అంగీకరిస్తూనే ఉన్నారు. దానిపై చర్యల్ని మరింత వాయిదా వేయడం మనం సరిదిద్దగలిగిన ఒక అసమతౌల్యాన్ని మరికొంత కాలం కొనసాగించడమే అవుతుంది. మహిళల ఆకాంక్షల పూర్తికి నడుం కట్టడం అనివార్యం. మన ప్రజాస్వామ్యాన్ని అందరికీ ప్రాతినిధ్యం వహించేదిగా, అందరి ఆకాంక్షలకూ స్పందించేదిగా, ఉజ్వల భవితవ్యానికి బాటలు వేసేదిగా తీర్చిదిద్దే చారిత్రక అవకాశం నిజంగా ఇదే. ఈ ఘడియలో మనందరం సమష్టిగా పనిచేయాలి. 

ఇది ఒక ప్రభుత్వానికో, పార్టీకో, వ్యక్తికో సంబంధించిన విషయం కాదు. జాతి యావత్తూ ఈ చర్య ప్రాధాన్యాన్ని గుర్తించి సమష్టిగా ఆశయ సాధన కోసం కదలాల్సిన అంశమిది. మన నారీ శక్తికి పట్టం కట్టి రుణం తీర్చుకోవాల్సిన తరుణమిది. అందుకే మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మనం తెలిపే ఆమోదం జాతీయ ప్రయోజనానికి పథనిర్దేశం చేస్తూ వీలైనంత విస్తృతంగా ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఉద్దేశించిన చారిత్రక సమావేశం దగ్గర పడుతున్న ఈ తరుణంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరికీ నా విన్నపం ఒకటే. భారత మహిళల కోసం తీసుకోనున్న ఈ చర్యకు అందరూ మద్దతు పలకండి. ఈ అవకాశాన్ని బాధ్యతగా, ఉద్దేశపూర్వకంగా అందిపుచ్చుకుందాం. అత్యున్నత ప్రజాస్వామ్య విలువల్ని ప్రతిబింబించేలా ప్రవర్తిద్దాం.

Source : Eenadu Telugu

2 hours ago

Home Flash News