Select Location
All Locations
State
Region
City / District
#PSL 2026: తగ్గేదేలే అంటున్న ఫఖర్.. పీఎస్‌ఎల్ బ్యాన్‌పై సవాల్

PSL 2026: తగ్గేదేలే అంటున్న ఫఖర్.. పీఎస్‌ఎల్ బ్యాన్‌పై సవాల్

ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్ వివాదం ఇప్ప‌టిలో సద్దుమణిగేలా క‌న్పించ‌డం లేదు. పీఎస్ఎల్‌-2026లో భాగంగా క‌రాచీ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో జ‌మాన్‌ బాల్ టాంపరింగ్ పాల్ప‌డిన‌ట్లు మ్యాచ్ రిఫ‌రీ రోషన్ మహానామ నిర్ధారించారు. దీంతో అత‌డిపై రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విధించింది.

అయితే ఈ నిర్ణయాన్ని ఫఖర్ ఇప్పుడు సవాల్ చేశాడు. కాగా పీఎస్‌ఎల్ (PSL) క్రమశిక్షణా కమిటీ విచార‌ణ‌లో ఫఖర్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు. త‌ను బంతిని ఆకారాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నించ‌లేద‌ని అత‌డు చెప్పుకొచ్చాడు. కాగా ఈ విచారణలో లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా ఆఫ్రిది, టీమ్ డైరెక్టర్ సమీన్ రానా కూడా ఫఖర్‌కు మద్దతుగా నిలిచారు. అత‌డితో పాటు షాహీన్‌, స‌మీన్ రానా కూడా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అత‌డి బ్యాన్‌పై మ‌రో 24 గంట‌ల్లో తుది నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశ‌ముంది. ఒక‌వేళ ఫ‌ఖార్ జ‌మాన్ అప్పీల్ తిర‌ష్క‌రిస్తే, ఏప్రిల్ 3న ముల్తాన్ సుల్తాన్స్‌తో గడ్డాఫీ స్టేడియంలో, ఏప్రిల్ 9న కరాచీలో జ‌రిగే మ్యాచ్‌ల‌కు జ‌మాన్ దూరం కానున్నాడు.

అస‌లేమి జ‌రిగిందంటే? లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఈ నెల 29న‌ కరాచీ కింగ్స్‌, లాహోర్ ఖలందర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. అయితే ఆఖ‌రి ఓవ‌ర్‌లో క‌రాచీ విజ‌యానికి 14 ప‌రుగులు అవ‌స‌రమ‌య్యాయి. ఆ సమయంలో హరీస్ రౌఫ్‌కు బంతిని ఇచ్చే ముందు ఫఖర్ బంతిని చేతి గోర్ల‌తో రుద్దుతూ క‌న్పించాడు. ఇది గ‌మ‌నించిన అంపైర్ వెంట‌నే బంతిని మార్చేయ‌డం కాకుండా ల‌హోర్‌కు ఐదు ప‌రుగుల పెనాల్టీ విధించారు. దీంతో పీఎస్‌ఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.14 ప్రకారం అత‌డిపై లెవల్ 3 నేరాన్ని మోపారు. అయితే ఫఖ‌ర్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించకుండా, విచారణను కోరాడు. విచారణలో కూడా త‌న వాద‌న‌లను బ‌లంగా వినిపించాడు. అయిన‌ప్ప‌టికి పీఎస్ఎల్ విచార‌ణ క‌మిటీ అత‌డిపై రెండు మ్యాచ్ బ్యాన్ విధించింది. ఇప్పుడు జ‌మాన్ అప్పీల్ చేయ‌డంలో ఈ వివాదం కొత్త మ‌లుపు తిరిగింది.


Sakshi 29 days ago
Home Flash News