పాక్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్
Pakistani ship: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ సరిహద్దుల్లోని వ్యూహాత్మక హర్మూజ్ (Hormuz) జలసంధి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిబంధనల సాకుతో పాకిస్థాన్‌కు చెందిన ఒక కంటైనర్ నౌకను ఇరాన్ వెనక్కి పంపడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
హర్మూజ్ జలసంధి గుండా కరాచీకి ప్రయాణిస్తున్న 'సెలెన్' (Selen) అనే పాక్ నౌకను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అడ్డుకుంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అవసరమైన ముందస్తు అనుమతులు ఈ నౌక వద్ద లేవని ఇరాన్ పేర్కొంది. ఈ ప్రాంతం గుండా వెళ్లే ప్రతి నౌక ఇరాన్ సముద్ర అధికార యంత్రాంగంతో కచ్చితంగా సమన్వయం చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే తాము జోక్యం చేసుకుంటామని IRGC స్పష్టం చేసింది. కాబుల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది.
హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు వ్యాపారానికి అత్యంత కీలకమైన మార్గం. ప్రస్తుత యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రాంతంలో తన పట్టును నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఏ దేశం నౌకైనా తమ నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని పాక్ నౌకను వెనక్కి పంపడం ద్వారా ఇరాన్ గట్టి సంకేతాలు పంపింది.
అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వబోతోందని, ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల నేతలు భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల యురేనియం అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15 కఠినమైన షరతులు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ నౌకనే ఇరాన్ అడ్డుకోవడం దౌత్యపరంగా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.