ఖాతాల్లోకి రైతు భరోసా
రైతులకు పెట్టుబడిసాయంగా అందజేస్తున్న రైతుభరోసా సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఖాతాల్లో జమచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ఖమ్మం: రైతులకు పెట్టుబడిసాయంగా అందజేస్తున్న రైతుభరోసా సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఖాతాల్లో జమచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆదివారం సిద్ధిపేట(Siddipet) జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఆదివారం సెలవు కావడంతో.. సోమవారం నుంచి సొమ్ములను రైతుల ఖాతాల్లో జమచేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తొలిదశగా ఎన్ని ఎకరాలున్నా సరే.. ప్రతీ రైతుకు ఎకరానికి రూ.6వేల చొప్పున జమచేశారు. ఉదాహరణకు ఐదెకరాలు సాగుచేస్తున్న రైతుకు కూడా ఎకరం భూమికి మాత్రమే రైతుభరోసా జమచేశారు.
రోజుల్లో మూడువిడతల్లో మొత్తం రైతుభరోసా సొమ్ములను జమకాబోతోంది. అంటే మరో 20రోజుల్లో రెండో విడత, 45రోజుల్లో మూడో విడత సొమ్ములు అందించనున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో సోమవారం 3,03,562మంది రైతులకు రూ.169.35కోట్లు జమయ్యాయి. మొత్తం 3,58,753మంది రైతులకుగాను రూ.440.63కోట్లు జమకావాల్సి ఉంది. అయితే కొన్ని బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఆధార్ లింక్‌కాకపోవడంతో తొలిరోజు కొన్ని ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. వాటిని కూడా త్వరితగతిన క్లియర్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కొత్తగూడెం వ్యవసాయం: రైతు భరోసా పథకంలో భాగంగా తొలి రోజు భద్రాద్రి జిల్లాలో 1,77,201 మంది రైతులకు సంబంధించి 5.85లక్షల ఎకరాలకుగాను రూ 315.55 కోట్లను జమ చేయాల్సి ఉంది. కాగా మొదటిరోజున ఒక ఎకరానికి గాను 1,77,201 మంది రైతులకు రూ98.75 కోట్లను జమ చేశారని జిల్లా వ్యవపాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు.