సీటు బుక్ చేసుకోండి.. ఆఫీసుకు రండి : మల్టీఫ్లెక్స్ తరహాలో టాప్ ఐటీ కంపెనీ కొత్త రూల్
ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ఆఫీసుకి వెళ్లాలనుకునే టెక్కీలు ముందుగానే సీటు బుక్ చేసుకోవడం తప్పనిసరి అంటూ అంతర్గత మెయిల్ లో స్పష్టం చేసింది. అలా కాకుండా నేరుగా ఆఫీసుకి వచ్చేసే వారిపై కంపెనీ నిఘా పెట్టింది. సీటు బుక్ చేసుకోకుండా పదే పదే కార్యాలయానికి వస్తే వారిపై 'కఠిన చర్యలు' తీసుకుంటామని యాక్సెంచర్ ఇండియా ఉద్యోగులకు పంపించిన మెయిల్‌లో స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా హైబ్రిడ్ పని విధానంలో ఉద్యోగులు తమ వీలును బట్టి ఆఫీసుకి వస్తుంటారు. కానీ యాక్సెంచర్ మాత్రం సీటు రిజర్వేషన్ లేనిదే లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. కొత్తగా తెచ్చిన ఈ రూల్స్ వల్ల షటిల్ సర్వీసులు వంటి రవాణా సౌకర్యాలను కూడా బుకింగ్ ఉన్నవారికే పరిమితం చేస్తోంది. అంటే సీటు లేకపోతే ఆఫీసు బస్సు ఎక్కే ఛాన్స్ కూడా ఉండదనమాట. బెస్ట్ ప్లానింగ్.. ఆఫీసు సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశమని కంపెనీ చెబుతోంది.
ఉద్యోగులు తాము ఆఫీసుకి వెళ్లాలనుకునే రోజుకు కనీసం ఒక రోజు ముందుగానే మధ్యాహ్నం 12 గంటల లోపు సీటును బుక్ చేసుకోవాల్సి ఉంటుందని యాక్సెంచర్ పేర్కొంది. దీనివల్ల ప్రతి ప్రాజెక్టుకు కేటాయించిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకుంటుంది. అయితే కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఆఫీసు స్థలాన్ని కుదిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సంఖ్య పెరిగినప్పటికీ, అందుకు తగ్గట్టుగా సీట్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ కఠిన నిబంధనలు తెచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.
టీసీఎస్ వంటి సంస్థలు వారానికి 5 రోజులు, ఇన్ఫోసిస్ నెలకు కనీసం 10 రోజులు ఆఫీసుకి రావాలని తమ ఉద్యోగులకు రూల్ పెట్టగా.. యాక్సెంచర్ మాత్రం సీటు బుకింగ్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కంపెనీ తన మార్జిన్లను పెంచుకోవడానికి కార్యాలయ వ్యయాలను క్రమబద్ధీకరిస్తోంది. ఈ క్రమంలో సీటు దొరకడమే ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. కాబట్టి యాక్సెంచర్ టెక్కీలు ఇకపై ఆఫీసుకి వెళ్లేముందు లాగిన్ అయి సీటును కన్ఫర్మ్ చేసుకోవడం మర్చిపోకూడదు.. లేదంటే 'కరెక్టివ్ యాక్షన్' పేరుతో చర్యలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.