తిరుమల అభివృద్ధికి పటిష్ఠ చర్యలు చేపట్టండి: సీఎం
తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల అభివృద్ధికి పటిష్ఠ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరికి సూచించారు. శుక్రవారం సాయంత్రం తిరుమల చేరుకున్న సీఎం స్థానిక శ్రీ గాయత్రి నిలయం అతిథిగృహంలో వారితో కొంతసేపు సమీక్షించారు. ముఖ్యంగా తిరుమలలో విద్యుత్ వినియోగం, విండ్ మిల్ నుంచి విద్యుదుత్పత్తి, సరాసరి వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు తిరుమలలో వాతావరణ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. తిరుపతి, తిరుమలలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల వ్యత్యాసంపై ఆరా తీశారు. కాలుష్య నియంత్రణకు తితిదే తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. తిరుమలలో భక్తుల వసతికి సంబంధించి చేస్తున్న ఏర్పాట్లు, వసతి పెంపునకు తిరుపతిలో చేస్తున్న ప్రణాళికలపై సీఎం ఆరా తీశారు. తితిదే ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు తితిదే భవిష్యత్ ప్రణాళికలను వాటి కార్యాచరణను సీఎంకు వివరించారు.