4 గంటల సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి: రాజమౌళి
ఇంటర్నెట్ డెస్క్: రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) ఉగాది సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖ హీరోలు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా దర్శక దిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) సోషల్ మీడియా వేదికగా ‘ధురంధర్ 2’ దర్శకుడు, హీరోని ప్రశంసిస్తూ, టీమ్‌ని అభినందిస్తూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.
‘‘ధురంధర్’ నాకు బాగా నచ్చింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’లోనూ భావోద్వేగాల పరంగా ఏమాత్రం తగ్గలేదు. ఆదిత్యధర్ (dhurandhar director) నాలుగు గంటల పాటు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని తెరపై ఆవిష్కరించారు. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. రచన, నటీనటులు, సాంకేతిక పరిజ్ఞానం, సంగీతం వేటిల్లోనూ లోపాలు కనిపించలేదు. చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో వచ్చే మలుపులు, భావోద్వేగాలను తెరపై చూపించడంలో దర్శకుడు విజయం సాధించారు. రణ్‌వీర్ (Ranveer Singh) తన నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు. జస్కిరాత్ సింగ్, హమ్జా అలీ మజారీగా రెండు పాత్రలకూ న్యాయం చేశారు. షెడ్డులో బంధించిన సోదరిని కలిసే సమయంలో ఆయన నటన మాస్టర్‌క్లాస్. సినిమా మొదటినుంచి పతాక సన్నివేశం వరకు రణ్‌వీర్ నటన హృదయాన్ని మెలిపెట్టేలా ఉంది. దేశ నిస్సహాయతను, అసహనాన్ని మాధవన్ తెరపై చక్కగా ప్రదర్శించారు. ఈ విజయం మనందరిదీ’’ అంటూ రాజమౌళి ‘ధురంధర్ 2’ చిత్రబృందాన్ని కొనియాడుతూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
రాజమౌళి ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా 120 దేశాల్లో ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది.