రేషన్‌కార్డు ఉంటేనే ఇందిరమ్మ బీమా.. గంటల్లోనే మారిన సర్కార్ పెద్దల స్వరం
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేయబోతున్నాం. ఈ పథకాన్ని కేవలం రేషన్‌కార్డు ఉన్నవారికే వర్తింపజేస్తాం’ ఇదీ గురువారం అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ సందర్భంగా వెల్లడించిన అంశం.
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేయబోతున్నాం. ఈ పథకాన్ని కేవలం రేషన్‌కార్డు ఉన్నవారికే వర్తింపజేస్తాం’ ఇదీ గురువారం అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ సందర్భంగా వెల్లడించిన అంశం. కానీ, అసెంబ్లీలో బడ్జెట్‌లో ఈ పథకం అమలుపై పద్దులో పొందుపర్చిన అంశానికీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనకు పొంతన లేకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్య తరగతి, ధనిక అని చూడకుండా రాష్ట్రంలోని 1 కోటీ 15 లక్షల కుటుంబాలకు 5 లక్షల చొప్పున జీవిత బీమా పథకాన్ని వర్తింపజేస్తామని భరోసా కల్పించారు.Geographic Reference
తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక గౌరవం.. అన్ని సౌకర్యాలతోపాటు ప్రతి కుటుంబానికి జీవిత భద్రత కల్పిస్తుంది.. అని సర్కార్ బడ్జెట్ పద్దులో హామీ ఇచ్చింది. కానీ, కేవలం రేషన్‌కార్డు ఉన్న కుటుంబానికే వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది కుటుంబాలు రేషన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన కుటుంబాలకూ కొత్త కార్డులు ఇంకా మంజూరు కాలేదు. దరఖాస్తు దశలోనే మరెన్నో కుటుంబాలు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి రేషన్‌కార్డును లింకు పెడితే ఆయా కుటుంబాలు ఆ పథకంలో అర్హత కోల్పోతాయి. దీంతో అసలు లక్ష్యం నీరుగారుతుంది.
ఎప్పుడు చేయాలో మాకు తెలుసు!
‘గ్యారెంటీలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో తమకు తెలుసు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఇదే చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు. దీనిపైనా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన నూరు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. రెండున్నరేండ్లు దాటినా, మూడు బడ్జెట్‌లు పూర్తయినా.. పూర్తిస్థాయిలో ఒక్క గ్యారెంటీని అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కార్‌పై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇంకా ఎప్పుడు చేస్తారు? అసలు అమలు చేస్తారా? చేయరా? ఆరు గ్యారెంటీలు అటకెక్కినట్టేనా? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కార్‌కు వ్యతిరేకంగా పోస్టులు వెస్తుండటం గమనార్హం.