అన్నాడీఎంకే మాజీ మంత్రుల కటౌట్‌లకు చెప్పుల మాలలు
ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే మాజీ మంత్రుల కటౌట్‌లకు చెప్పుల మాల వేసిన వ్యక్తుల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రతను డిమాండ్ చేస్తూ, డీఎంకే ప్రభుత్వ తీరును ఖండిస్తూ అన్నాడీఎంకే నేతృత్వంలో 17న నిరసన జరిగింది. నిరసనలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు కొందరు మహిళలపై మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు షణ్ముగం, దిండుక్కల్ శ్రీనివాసన్, ఎంఆర్.భాస్కర్, కటౌట్‌లకు కోవై జిల్లా పొళ్లాచ్చిలో చెప్పుల మాలలు, స్కర్టులు వేసి వ్యతిరేకత తెలిపారు. గురువారం ఉదయం వాటిని చూసిన అన్నాడీఎంకే శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం మేరకు పొళ్లాచ్చి పోలీసులు అక్కడికి చేరుకుని కటౌట్‌లు తొలగించారు. ఎవరు ఏర్పాటు చేశారనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు.