కువైట్‌లో కీలకమైన రిఫైనరీపై ఇరాన్ దాడి
ఇంటర్నెట్‌డెస్క్: గల్ఫ్ దేశాల్లోని కీలక చమురు వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ (Iran) తన దాడులను తీవ్రతరం చేసింది. ఇటీవల ఖతార్‌లోని రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంపై, సౌదీ అరేబియాకు చెందిన అరామ్‌కోపై దాడులు చేయగా.. తాజాగా కువైట్ (Kuwait)లో కీలకమైన మినా అల్- అహ్మదీ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడికి పాల్పడింది.
కువైట్‌లో శుక్రవారం రంజాన్ పండుగ జరుపుకుంటున్న తరుణంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. పశ్చిమాసియాలో అతిపెద్ద రిఫైనరీల్లో ఈ మినా అల్- అహ్మదీ (Mina Al-Ahmadi oil refinery) కూడా ఒకటి. డ్రోన్ దాడి నేపథ్యంలో రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. అధికారులు వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు. రోజుకి దాదాపు 7,30,000 బ్యారెళ్ల చమురు శుద్ధి చేయగల ఈ రిఫైనరీపై గురువారం కూడా ఇరాన్ దాడి చేసింది.
దుబాయ్‌లో భారీ పేలుళ్లు..
దుబాయ్ (Dubai) నగరం పైకి ఇరాన్ డ్రోన్‌లు దూసుకురాగా, వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకొన్నాయి. ఈ క్రమంలో భారీ పేలుళ్లు వినిపించాయి. ఇక, తమపై దూసుకొచ్చిన ఓ క్షిపణిని అడ్డుకొన్నట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ క్రమంలో దాని శకలాలు ఓ గిడ్డంగిపై పడటంతో మంటలు చెలరేగాయని పేర్కొంది.