Select Location
All Locations
State
Region
City / District
‘మహాలక్ష్మి’ పథకంతో మహిళలకు రూ.9,222 కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్‌

‘మహాలక్ష్మి’ పథకంతో మహిళలకు రూ.9,222 కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్‌

హైదరాబాద్‌: ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. ప్రతి వర్గానికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ (Telangana Assembly) సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు.

‘‘శ్రమించేతత్వం గల తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజా కేంద్రీకృత పాలన ప్రభుత్వ విధానం. విజన్‌-2047 ద్వారా 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్‌ రూపొందించాం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18లక్షలకు చేరింది. క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ మోడల్‌ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. పట్టణాభివృద్ధికి క్యూర్‌ మోడల్‌ అనుసరిస్తున్నాం. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా. జీహెచ్‌ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా.. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం. హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం.

23వ బయో ఆసియా సదస్సు ద్వారా రూ.1700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. జీసీసీలలో 20 శాతం ఆతిథ్యం ఇస్తూ హైదరాబాద్‌ గ్లోబల్‌ టెక్‌ హబ్‌గా మారింది. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ కొనసాగుతోంది. ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ రంగం 9.39లక్షల ఉద్యోగాలు కల్పిస్తోంది. కొడంగల్‌ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది.

గతేడాది వానాకాలంలో రైతుభరోసా కింద రూ.8,744 కోట్లు ఇచ్చాం. పంట రుణమాఫీ కోసం రూ.20,616 కోట్లు ఖర్చు చేశాం. సాగునీటి రంగానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా 15.12లక్షల రేషన్‌ కార్డులు ఇచ్చాం. 3.38 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.9,222 కోట్లు ఆదా అయ్యాయి. ఎస్‌హెచ్‌జీలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టాం. ఈగల్‌ ప్రత్యేక బృందం ద్వారా డ్రగ్స్‌సమస్యను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాం. టీజీపీఎస్సీ, ఇతర నియామక బోర్డులను సంస్కరించాం. రికార్డు సమయంలో 67,763 ఉద్యోగాలను భర్తీ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం’’ అని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.


Eenadu Telugu 29 days ago
Home Flash News