Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Annadata Sukhibhav : పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు పదమూడో తేదీన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. చంద్రబాబు గన్నవరంలో జరిగే కార్యక్రమంలో రైతులతో మాట్లాడతారు.
Ugadi gift to AP farmers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతన్నలకు కూటమి ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం నిధులను, కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ నిధులతో కలిపి ఈ నెల 13వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తారు.
ఈ విడతలో భాగంగా అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ. 6,000 జమ కానున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద అందించే రూ. 2,000 ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా అన్నదాత సుఖీభవ కింద రూ. 4,000 అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విడత కోసం మొత్తం రూ. 2,808 కోట్లను కేటాయించింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఈ ఆర్థిక సాయం రైతులకు ఎంతో ఊరటనివ్వనుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏటా రూ. 20,000 అన్నదాత సుఖీభవ కింద జమ చేస్తున్నారు. ఇందులో రాష్ట్రం రూ. 14,000 , కేంద్రం రూ. 6,000 పెట్టుబడి సాయం ఇస్తున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రూ. 14,000 చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇప్పుడు అందజేయబోయే మూడో విడత రూ. 6,000తో కలిపి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తి చేసినట్లవుతుంది.
కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని గువాహటి నుంచి పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుండగా, అదే సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం ఇప్పటికే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైతులు తమ ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ సొమ్మును పొందుతారు.