శ్రీశైలంలో సాయుధ బలగాలు : భక్తుల రద్దీ కంట్రోల్ కోసం రంగంలోకి..
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో అదుపు తప్పిన ఘటనలు చోటుచేసుకున్నాయి. శివస్వాములు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో బందోబస్తు విధులకు స్పెషల్ పార్టీ, ఆర్ముడ్ రిజర్వ్, ఏసీఎస్పీ సిబ్బంది కర్నూలు..నంద్యాల.. అన్నమయ్య జిల్లాల నుంచి 180 మంది సాయుధ బలగాలు విధులు నిర్వహిస్తారు. వీరికి నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్ దిశా నిర్దేశం చేశారు.
శివదీక్షను ధరించిన భక్తులు సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తారు. భక్తులు ఎంతో కఠిన దీక్షచేసి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి వస్తారు. మల్లన్న భక్తులు స్వామిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. శివస్వాములతో గౌరవప్రదంగా మాట్లాడాలని .. వారికి ప్రశాంతంగా దైవ దర్శనం కలిగేలా అన్ని రకాలుగా దిశా నిర్దేశం చేయాలని సూచించారు. విధులలో ఉన్న సిబ్బంది ఎట్టి పరిస్థితిలో సహనం ల్పోకూడదన్నారు. ఎవరికి కేటాయించిన ప్రదేశాల్లో వారు నిరంతరం విధులు నిర్వహించాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువుగా ఉన్నా.. అనుకోని సంఘటన జరిగినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు.