భారత వైమానిక రంగానికి అమెరికా కఠిన పరీక్ష!
దిల్లీ: అమెరికాకు (USA) చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) బృందం సోమవారం దిల్లీ రానుంది. ఐదు రోజుల పాటు భారత్‌లో పర్యటించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అవసరమైన నియంత్రణ చట్టాలను కలిగి ఉందో లేదో పరిశీలించనుంది. శిక్షణ పొందిన సిబ్బంది, సంస్థాగత సామర్థ్యాలు ఉన్నాయో లేదో పరీక్షించనుంది. దాదాపు 200కుపై ప్రశ్నలకు ఎఫ్‌ఏఏ సమాధానాలు రాబట్టే అవకాశం ఉన్నట్లు డీజీసీఎ వర్గాలు వెల్లడించాయి. ఎఫ్‌ఏఏ నిర్వహించే ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్‌మెంట్ (ఐఏఎస్‌ఏ)లో కేటగిరి 1 స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఎఫ్‌ఏఏ ఏం పరీక్షిస్తుంది?
అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా డీజీసీఏ వ్యవహరిస్తోందా? లేదా? అనే అంశంపై ఎఫ్‌ఏఏ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) భద్రత ప్రమాణాలను డీజీసీఏ సమర్థంగా అమలు చేస్తుందో లేదో పరిశీలిస్తుంది. దేశ విమానయాన చట్టాలు, పౌర విమానయాన కార్యకలాపాలను నియంత్రించే నిబంధనలు, భద్రతా ప్రమాణాలు, సిబ్బంది సాంకేతిక అర్హతలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. విమాన సిబ్బందికి లైసెన్సులు, విమాన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు పటిష్ఠ వ్యవస్థలు ఉన్నాయో లేదో ఆరా తీస్తుంది. ఎయిర్ లైన్స్ కార్యకలాపాలను నియంత్రించేందుకు, ఉల్లంఘనల గుర్తింపు, చర్యల గురించి తెలుసుకుంటుంది.
బ్రేకులు పనిచేయకుండానే.. వందే భారత్‌ను 463 కి.మీ. తరలించి!
కేటగిరీ 1 రేటింగ్‌తో భారత్‌కు ఉపయోగమేంటి?
ఐఏఎస్‌ఏ ప్రోగ్రామ్‌లో కేటగిరీ 1 రేటింగ్‌ను నిలబెట్టుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఐసీఏవో భద్రత ప్రమాణాలను సమర్థంగా అమలు చేసినప్పుడే ఎఫ్‌ఏఏ ఈ రేటింగ్ ఇస్తుంది. కేటగిరీ -1లో ఉన్న దేశాల నుంచి తమ దేశానికి ఎయిర్‌లైన్ సేవలను విస్తరించుకునేందుకు అమెరికా అవకాశం కల్పిస్తుంది. అదే కేటగిరీ-2లో ఉంటే అమెరికాలో ఎయిర్‌లైన్స్ సేవల విస్తరణకు అవకాశం ఉండదు. అప్పటికి కొనసాగుతున్న సేవలపైనా ఎఫ్‌ఏఏ నిఘా పెడుతుంది. 2014లో భారత్ కేటగిరీ-2కి పడిపోయింది. మళ్లీ 2015లో కేటగిరి-1 రేటింగ్‌కు చేరుకుంది. వేగంగా విస్తరిస్తున్న భారత విమానయాన రంగానికి ఈ గుర్తింపు చాలా అవసరం. కేవలం అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశించడానికి మాత్రమే కాకుండా.. భారతదేశ విమానయాన నియంత్రణ వ్యవస్థపై విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి కూడా ఎఫ్‌ఏఏ ఆడిట్ సహకరిస్తుంది.