Select Location
All Locations
State
Region
City / District
కన్నెత్తి చూస్తే ఖబడ్దార్‌!

కన్నెత్తి చూస్తే ఖబడ్దార్‌!

ఆపరేషన్‌ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం పాకిస్తాన్‌లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం ఇది ఆరంభం మాత్రమే: ఆర్మీ జైపూర్‌: సరిహద్దుకు అవతలి వైపు ఉన్న ఏ ఒక్క ఉగ్రవాద స్థావరం సురక్షితం కాదని భారత సైన్యం తేల్చిచెప్పింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. భారత్‌ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముష్కర మూకలను హెచ్చరించింది. వారు ఎక్కడ దాక్కున్నా భారత సైన్యం దాడుల నుంచి తప్పించుకోలేరని స్పష్టంచేసింది. ఆపరేషన్‌ సిందూర్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా, ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన భారత త్రివిధ దళాల సీనియర్‌ అధికారులు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 

గత ఐదు దశాబ్దాల్లో భారత్‌ చేపట్టిన అత్యంత ముఖ్యమైన ఆపరేషన్‌ గురించి వివరించారు. ఉమ్మడి ఆపరేషన్‌ ద్వారా త్రివిధ సాధించిన వ్యూహాత్మక విజయాలను తెలియజేశారు. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌ 100 మందికి పైగా సైనికులను కోల్పోయిందని పేర్కొన్నారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదుల హతమయ్యారని చెప్పారు. సుదీర్ఘ యుద్ధంలోకి నెట్టకుండానే విజయం: రాజీవ్‌ ఘాయ్‌ నియంత్రణ రేఖకు అవతల ముష్కరులకు సురక్షిత స్థావరం అంటూ ఏదీ లేదని డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌(స్ట్రాటజీ) లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ చెప్పారు. ప్రతిదానిపైనా దాడి చేస్తామని అన్నారు. ప్రతిదాన్నీ వెంటాడి వేటాడుతామన్నారు. పరిస్థితులు, సమయం, పద్ధతి అన్నీ తమ అదీనంలోనే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై యుద్ధంలో ఆపరేషన్‌ సింధూర్‌ ముగింపు కాదని, కేవలం ఆరంభం మాత్రమేనని తేల్చిచెప్పారు. 

నష్టం వాటిల్లలేదు: ఎ.కె.భారతి ఆపరేషన్‌ సిందూర్‌ విజయంలో భారత వైమానిక దళం చిరస్మరణీయ పాత్ర పోషించిందని ఐఏఎఫ్‌ డిప్యూటీ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఎ.కె.భారతి అన్నారు. మన సైనిక శక్తి నానాటికీ బలోపేతం అవుతోందని చెప్పారు. భారత వైమానిక దళం చైనా, పాకిస్తాన్‌ల కార్యకలాపాలను నిరంతరం పరిశీలిస్తోందని తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ధ్వంసం చేశామని, 11 విమానాశ్రయాలపై దాడి చేశామని గుర్తుచేశారు. అలాగే 13 విమానాలను నేలమట్టం చేశామన్నారు. అందులో ఒకటి 300 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండగా కూల్చేసినట్లు చెప్పారు. పాకిస్తాన్‌ జవాన్లు కూడా దాడికి దిగినప్పటికీ నష్టాన్ని కలిగించలేకపోయారని పేర్కొన్నారు. పాక్‌ నౌకాదళాన్ని ఓడరేవులకే పరిమితం చేశాం: ఎ.ఎన్‌.ప్రమోద్‌ ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌ అనుసరిస్తున్న వ్యూహాత్మక దృక్పథానికి ఆపరేషన్‌ సిందూర్‌ ఒక ప్రతీక అని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ నావల్‌ ఆపరేషన్స్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎ.ఎన్‌.ప్రమోద్‌ అన్నారు. సింధూర్‌ సమయంలో భారత నావికాదళం దూకుడుగా వ్యవహరించడంతో పాకిస్తాన్‌ నౌకాదళం, వాయుసేన విభాగాలు రక్షణాత్మక వైఖరిని అవలంబించాల్సి వచ్చిందని తెలిపారు. పాకిస్తాన్‌ నౌకాదళాన్ని చాలావరకు వారి ఓడరేవులకే పరిమితం చేశామన్నారు.


Sakshi 22 days ago
Home Flash News