Select Location
All Locations
State
Region
City / District
సిరికొండ పీఏసీఎస్లో అవినీతి భాగోతం దొడ్డు వడ్లను సన్నాలుగా చూపి.. రూ.38 లక్షల బోనస్ స్వాహా

సిరికొండ పీఏసీఎస్లో అవినీతి భాగోతం దొడ్డు వడ్లను సన్నాలుగా చూపి.. రూ.38 లక్షల బోనస్ స్వాహా

నిజామాబాద్, వెలుగు: సన్నాల సాగును ప్రోత్సహించేందుకు గవర్నమెంట్​ ఇస్తున్న రూ.500 బోనస్​ సొమ్మును కాజేసిన ఘటన నిజామాబాద్​ జిల్లాలో వెలుగుచూసింది. 2025-–26 ఖరీఫ్​లో కొనుగోలు చేసిన దొడ్డు వడ్లను రికార్డులో సన్నాలుగా నమోదు చేసి రూ.38 లక్షల బోనస్​ సొమ్మును అక్రమార్కులు కాజేశారు. సిరికొండ పీఏసీఎస్​ ఆధ్వర్యంలో మైలారం విలేజ్​లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఈ అక్రమాలు జరగగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ వ్యవహారాన్ని సీరియస్​గా తీసుకొని విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో మూడు రైస్​ మిల్లుల​పాత్ర ఉన్నట్లు తేలడంతో యాసంగి వడ్ల అలాట్​మెంట్​ను రద్దు చేశారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఇంకా ఎక్కడైనా జరిగియా? అనే కోణంలో సివిల్​ సప్లై ఆఫీసర్లు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు.

రైతులు సాగు చేసిన వడ్లు కొనేందుకు ప్రభుత్వం పీఏసీఎస్​లు, ఐకేపీ, ఐడీసీఎంఎస్, మెప్మా ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. రైతు తెచ్చిన వడ్లు కాంటా పెట్టిన బ్యాగ్​లను అలాట్​మెంట్​ పొందిన రైస్ మిల్లులకు పంపిస్తారు. బ్యాగ్​లు అన్​లోడ్ చేసుకునే మిల్లర్​ వడ్ల రకాన్ని, తూకాన్ని క్రాస్​ చెక్​ చేసుకొని సంతకం చేసిన ట్రక్​ షీట్​ తిరిగి కొనుగోలు సెంటర్​కు పంపిస్తాడు. వడ్లు అమ్మిన రైతు వివరాలను ట్యాబ్​లో ఎంటర్​ చేస్తారు. దాని ప్రకారం రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఇదిలాఉంటే సిరికొండ పీఏసీఎస్​​ పరిధిలోని 13 గ్రామాల్లో వడ్లు కొనుగోలు చేశారు. ఇందులో మైలారం విలేజ్ లో కొనుగోలు చేసిన 7,631 క్వింటాళ్ల దొడ్డు వడ్లను ట్రక్​ షీట్ రికార్డులో సన్నాలుగా చూపించి, రూ.38 లక్షల బోనస్​ రైతుల ఖాతాల్లో వేయించారు. అయితే తాము దొడ్డు వడ్లు అమ్మితే సన్నాల బోనస్​ జమ కావడంతో రైతులు విస్మయానికి గురయ్యారు. ట్యాబ్ ఎంట్రీలో పొరపాటు జరిగిందని చెబుతూ పీఏసీఎస్​ స్టాఫ్​ రైతుల వద్దకు వెళ్లి బోనస్​ డబ్బులను వసూలు​చేశారు. కొందరు రైతులు డబ్బు వాపస్​ ఇవ్వడానికి నిరాకరించడంతో విషయం బయటకు వచ్చింది. విషయం కలెక్టర్ కు​చేరడంతో 15 రోజుల కింద విచారణకు ఆదేశించారు.


V6 News 59 minutes ago
Home Flash News