Select Location
All Locations
State
Region
City / District
అలా చేయకుంటే.. పశ్చిమాసియా, ఐరోపాలు ముక్కలైపోయేవి: ట్రంప్‌

అలా చేయకుంటే.. పశ్చిమాసియా, ఐరోపాలు ముక్కలైపోయేవి: ట్రంప్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి సమర్థించుకున్నారు. బీ2 బాంబర్లతో ఆ దేశంపై దాడి చేసి.. అది అణ్వాయుధాన్ని తయారుచేయకుండా అడ్డుకున్నామన్నారు. ఒకవేళ తాను అలా చేయకుంటే.. పశ్చిమాసియా, ఐరోపా దేశాలు ముక్కలైపోయి ఉండేవని వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇరాన్‌ (Iran) అనే అందమైన దేశంలోకి వెళ్లి.. వారి వద్ద అణ్వాయుధం లేదని మనం నిర్ధరించుకోవాలి. బీ2 బాంబర్లతో మేం వారిని అడ్డుకున్నాం. ఒకవేళ మేం అలా చేయకపోయి ఉంటే.. 

వారి వద్ద అణ్వాయుధం (nuclear weapon) ఉండేది. ఇజ్రాయెల్‌, పశ్చిమాసియాతో సహా ఐరోపా దేశాలు ముక్కలు ముక్కలుగా పేలిపోయి ఉండేవి’ అని ట్రంప్‌ అన్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌ నాయకత్వం కూడా బలహీనపడిందని పేర్కొన్నారు. దీంతో ఆ దేశ సైనిక సామర్థ్యం గణనీయంగా క్షీణించిందన్నారు. తమ సైనిక చర్యతో ఇరాన్‌ నాశనమైందని.. వారి వైమానిక, నావికాదళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని మరోసారి ఉద్ఘాటించారు. శాంతిచర్చలు తాను ఆశించినవిధంగా జరగకపోవడంపై ట్రంప్‌ అసహనం వ్యక్తంచేశారు. కుదరని సయోధ్య దీనికి ముందు వైట్‌హౌస్‌లో విలేకరులతో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభంపై ట్రంప్‌ మాట్లాడారు. 

పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఘర్షణ ముగిశాక.. అణ్వాయుధాలు లేని ఇరాన్‌ను మనం చూస్తాం. అణ్వాయుధాలు కలిగిఉండడానికి వారికి అనుమతిస్తే.. అది ప్రపంచం మొత్తానికి ప్రమాదం. కాబట్టి అలా జరగకూడదు. యుద్ధం ముగిసిన వెంటనే పెట్రోల్‌ ధరలు తగ్గుతాయి’ అని ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌ తమతో ఒప్పందం చేసుకోవాలనుకుంటుందని కానీ, వారి ప్రతిపాదన తనకు సంతృప్తిగా లేదన్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌లో నాయకత్వం విచ్ఛిన్నం అయ్యిందని..

అక్కడ నాలుగైదు గ్రూపులు ఉన్నాయన్నారు. ఒప్పందం విషయంలో వారి మధ్య గందరగోళం నెలకొందన్నారు. యుద్ధంపై భిన్న ప్రకటనలు.. ఇక, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. యుద్ధంపై ట్రంప్‌ మరోసారి భిన్నమైన ప్రకటనలు చేశారు. యుద్ధంపై 60 రోజుల్లోగా కాంగ్రెస్‌ అనుమతి తీసుకోవాలని చెప్పడం చట్టవిరుద్ధమన్నారు. 60 రోజుల అనుమతి వాదన చేస్తున్న ప్రతిపక్ష డెమోక్రాట్లు అసలు దేశభక్తులే కాదని విమర్శించారు. కాగా దీనికి ముందు ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని ట్రంప్‌ అమెరికా కాంగ్రెస్‌కు తెలిపారు.


Eenadu Telugu 1 hour ago
Home Flash News