గవర్నమెంట్ స్కూళ్లలో రికార్డుస్థాయి ఉత్తీర్ణత.. ఆ ఘనత టీచర్లదే:కేకేశవరావు
ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రానే వచ్చాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 95 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. అత్యధికంగా ములుగు జిల్లాలో 99.10 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.50శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత పెరడగంపై కేకేశవరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో టెన్త్ క్లాస్ విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారంటే ఆ గొప్పతనం టీచర్లదే అన్నారు ప్రభుత్వ సలహాదారు కేకేశవరావు. క్లాస్ రూం కేవలం విద్యా బోధించే తరగతి గదులే కాదు.. సోషల్ స్పేస్ అన్నారు కేశవరావు. విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చి దిద్దడంలో టీచర్లది కీలక పాత్ర అన్నారు. టీచర్లు, పేరెంట్స్ కృషితోనే విద్యార్థులు అత్యధికంగా ఫలితాలను సాధించారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఫలితాలు వచ్చాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావృద్దికి కృషి చేస్తుందన్నారు. గత కొంతకాలంగా విద్యా వ్యవస్థపై దృష్టి సారించడంతోనే ఈ స్థాయిలో ఫలితం వచ్చిందన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మరో నెల రోజుల్లో సప్లిమెంటరీ ఉంటుంది.. తప్పిన సబ్జెక్టులను జాగ్రత్తగా చదువుకొని ఉత్తీర్ణత సాధించాలని కోరారు.
ఇక టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరోసారి ఎగ్జామ్స్ రాసుకునేందుకు ఛాన్స్ ఇస్తోంది విద్యాశాఖ. జూన్ 5 నుంచి 12 తేదీవరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫెయిల్ అయిన విద్యార్థులు రేపటినుంచి అంటే ఏప్రిల్ 30 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
బుధవారం ( ఏప్రిల్ 29) ప్రకటించిన తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ప్రభుత్వ సోషల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 86.18 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 99.10 శాతం, మోడల్స్ స్కూల్స్ లో 97.83 శాతం, కేజీబీవీ స్కూళ్లలో 98 శాతం,ప్రైవేట్ పాఠశాలల్లో 95.81 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. మరోవైను 2065 జిల్లా పరిషత్ స్కూళ్లలో 100 శాతం పాస్ పర్సెంటేజ్ నమోదు అయింది.