Dhurandhar 2 |‘ధురంధర్ 2’ దూకుడు.. కానీ ‘బాహుబలి 2’, ‘దంగల్’ రికార్డులు అందని ద్రాక్షే!
Dhurandhar 2 | రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2’ సినిమా ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసింది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, టాప్ రికార్డులను సైతం దాటేస్తుందని భావించారు. అయితే చివరికి బాహుబలి 2, దంగల్ సినిమాల రికార్డులను మాత్రం అందుకోలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1764.15 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ‘బాహుబలి 2’ రూ. 1788.06 కోట్లతో ముందంజలో ఉండగా, ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ రూ. 2070.3 కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో ‘ధురంధర్ 2’ టాప్ ప్లేస్‌కు దగ్గరగా వచ్చినా, చివరి అడుగులో వెనుకబడింది.
‘దంగల్’ సినిమాకు చైనా మార్కెట్ భారీగా కలిసి వచ్చింది. కేవలం ఆ దేశంలోనే రూ. 1305 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం దాని విజయానికి ప్రధాన కారణం. కానీ ‘ధురంధర్ 2’కు చైనాలో అలాంటి అవకాశం దక్కలేదు. మరోవైపు గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించడంతో కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది. అక్కడ విడుదలై ఉంటే అదనంగా రూ.100 కోట్ల వరకు వసూళ్లు వచ్చేవని అంచనా. దక్షిణాది రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2’కు మంచి స్పందన లభించినా, వసూళ్లు మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాలేదు. పుష్ప 2, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాలు హిందీతో పాటు దక్షిణాదిలోనూ భారీ వసూళ్లు సాధించాయి. కానీ ‘ధురంధర్ 2’ మాత్రం ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది.
భాషల వారీగా చూస్తే తెలుగు: రూ. 42.56 కోట్లు, తమిళం: రూ. 19.39 కోట్లు, కన్నడ: రూ. 3.66 కోట్లు,మలయాళం: రూ. 1.77 కోట్లు.. ఈ సంఖ్యలు పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి ‘A’ సర్టిఫికేట్ రావడం కూడా ఒక కారణంగా మారింది. 18 ఏళ్ల పైబడిన ప్రేక్షకులకే పరిమితమవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడంలో వెనుకబడ్డారు. అదేవిధంగా సినిమా నిడివి 3 గంటల 49 నిమిషాలు ఉండటం, ఎక్కువ హింస ఉండటం కూడా కొంత మంది ప్రేక్షకులను దూరం చేసింది. మొత్తానికి ‘ధురంధర్ 2’ భారీ విజయాన్ని సాధించినప్పటికీ, టాప్ రికార్డులను బద్దలు కొట్టడంలో కొన్ని అంశాలు అడ్డుగా నిలిచాయి. అయినప్పటికీ, బాలీవుడ్‌కు ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ మాత్రం విశేషమని చెప్పాలి.