సిగరెట్ ఫ్రీ దిశగా ఇంగ్లాండ్: రివర్స్లో నిబంధనలు.. 18 ఏళ్లు పైబడిన వాళ్లకు అమ్మితే నేరం !
18 ఏళ్లలోపు వాళ్లకు సిగరెట్లు అమ్మితే నేరం.. 18 ఏళ్లలోపు వాళ్లకు పబ్స్, బార్లలో నో ఎంట్రీ.. 18 ఏళ్ల లోపు వాళ్లకు మద్యం అమ్మటం నేరం.. 18 ఏళ్ల లోపు వాళ్లకు A సర్టిఫికెట్ ఉన్న సినిమా ధియేటర్లలోకి నో ఎంట్రీ.. ఇదీ ఇప్పటి వరకు నడుస్తున్న చరిత్ర.. ఇప్పుడు ఈ చరిత్రను తిరగరాసింది ఇంగ్లాండ్ దేశం. అవును.. ఎవరూ ఊహించని విధంగా స్మోకింగ్పై కొత్త నిబంధనలతో బిల్లు తీసుకొచ్చింది.
ఇక నుంచి 18 ఏళ్లు పైబడిన కుర్రోళ్లకు సిగరెట్లు అమ్మటం నేరం.. అవును.. మీరు చదువుతున్నది అక్షర సత్యం. కొత్త తరం యువతలో స్మోకింగ్ కల్చర్.. పొగతాగే అలవాట్లను శాశ్వతంగా దూరం చేసే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొచ్చింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. 2009, జనవరి 1వ తేదీ తర్వాత పుట్టిన వాళ్లకు.. ఇంగ్లాండ్ దేశంలో సిగరెట్లు అమ్మటం నేరం.. 2009వ సంవత్సరం ముందు పుట్టిన వాళ్లకు ఓకే.. 2009 జనవరి ఒకటో తేదీ తర్వాత పుట్టిన వాళ్లకు సిగరెట్లు అమ్మటాన్ని నేరం చేస్తూ బిల్లు తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. అంటే.. 2009 తర్వాత పుట్టిన వాళ్లకు 18 సంవత్సరాలు దాటినా స్మోకింగ్ చేయడానికి అనర్హుల కిందే లెక్క.
"పొగ రహిత తరం" సృష్టించడమే లక్ష్యంగా ఇంగ్లండ్ పార్లమెంట్ చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇకపై.. ఇంగ్లండ్లో 1 జనవరి 2009న లేదా ఆ తర్వాత పుట్టిన వ్యక్తులు ధూమపానం చేయడానికి వీల్లేదు. పొగాకు, వేపింగ్, నికోటిన్ ఉత్పత్తులను వాటి ఫ్లేవర్లు, ప్యాకేజింగ్‌తో సహా నియంత్రించడానికి మంత్రులకు ఈ బిల్లు కొత్త అధికారాలను ఇచ్చింది. ఈ బిల్లుకు రాజ ఆమోదం లభించిన తర్వాత అది చట్టంగా మారుతుంది. అయితే ఈ ప్రక్రియ ఇక లాంఛనం. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదాన్ని క్యాన్సర్ రీసెర్చ్, ఆస్తమా అండ్ లంగ్ యూకే వంటి స్వచ్ఛంద సంస్థలు స్వాగతించాయి.