ఇరాన్‌పై మళ్లీ బాంబులు పడతాయ్: ట్రంప్ వార్నింగ్
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్‌తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ (Donald Trump) ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారంలోగా ఆ దేశం తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. లేదంటే.. దానిపై మళ్లీ బాంబులేస్తామని హెచ్చరించారు. ఆరిజోనాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఈనెల 21తో ముగియనుంది. ఈలోపే ఒక ఒప్పందం చేసుకోవాలని ఇరుదేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందులోభాగంగా ఇస్లామాబాద్ వేదికగా.. అమెరికా- ఇరాన్ మధ్య సోమవారం మరోసారి చర్చలు జరగనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ (Iran)కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. బుధవారంలోగా ఓ ఒప్పందం చేసుకోవాలన్నారు. ఒప్పందం కుదరకపోతే..
21వ తేదీ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించకపోవచ్చని తెలిపారు. ఆ దేశంపై మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ నౌకల రాకపోకలపై తమ దిగ్బంధనం కొనసాగుతోందన్నారు. చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ఇరాన్ యురేనియంను అమెరికాకు తీసుకొస్తాం ఇరాన్‌తో కలిసి దాని అణుకేంద్రాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను భౌతికంగా వెలికితీయనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. యురేనియం కోసం తవ్వకాలు చేపడతామని, అందుకు తమకు భారీగా సామగ్రి కావాల్సి ఉంటుందన్నారు. దాన్ని త్వరలోనే అమెరికా భూభాగంలోకి తరలిస్తామని వెల్లడించారు.
ఈసందర్భంగా అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందన్నారు. శుద్ధి చేసిన యురేనియం (Enriched Uranium) నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందంటూ ట్రంప్ ఇంతకుముందు కూడా ప్రకటించారు. అయితే, టెహ్రాన్ వీటన్నింటిని కొట్టిపారేసింది. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించేది లేదని ఆ దేశ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రకటన వెలువడిన తర్వాత కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలా అయితే.. హర్మూజ్‌ను మళ్లీ మూసేస్తాం.
ఇరాన్ వార్నింగ్ నాటో సాయం అవసరం లేదు నాటో (NATO)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో ఉద్రిక్తతల సమయంలో ఈ కూటమి అసమర్థంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇకపై తనకు దాని సాయం అవసరం లేదన్నారు. ‘‘హర్మూజ్ జలసంధికి సంబంధించి దాదాపు అన్ని సమస్యలు సద్దుమణిగాయి. ఇప్పుడు మీకు ఏదైనా సాయం కావాలా అంటూ నాటో నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘రెండు నెలల క్రితమే మీ సాయం కావాల్సిఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేదు’ అని వారితో చెప్పా’’ అని ట్రంప్ అన్నారు. నిజానికి నాటోతో తమకు ఎప్పుడూ అవసరం పడలేదని, వారికే తమ అవసరం ఉందని వ్యాఖ్యానించారు.