RTC Strike | ఆర్టీసీ సమ్మె నిర్వీర్యానికి కుట్రలు.. హక్కుల సాధన కోసం రోడ్లెక్కి కొట్లాడుతున్న కార్మికులు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, పీఆర్సీ, ఏరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 22 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తుండగా.. దానిని నిర్వీర్యం చేసేందుకు కొన్ని కార్మిక సంఘాలు కుట్రలు పన్నుతున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జేఏసీలో లేని కొన్ని సంఘాలు ఇటీవల వరుసగా సమావేశం అవుతుండటం పట్ల కార్మికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా హక్కులు సాధించుకొనే క్రమంలో సమ్మెకు పిలుపునివ్వగా.. కొన్ని సంఘాలు ప్రభుత్వ పెద్దలతో లాలూచీపడి.. సమ్మెను నిర్వీర్యం చేశాయని గుర్తు చేసుకుంటున్నారు. దాంతో మరో ఏడాదిపాటు ఆగాల్సి వచ్చిందని చెప్తున్నారు. డిమాండ్లను సాధించుకొనేందుకు మళ్లీ ఆర్టీసీ కార్మికులు, సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మెకు పిలుపునిస్తే.. అందులో కలిసిరాకుండా సొంతంగా మీటింగ్‌లు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.City & Local Guides
సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని బస్ డిపోల ఎదుట ‘గేట్ మీటింగ్’లతో జోష్ పెంచుతున్నారు. సమ్మె కరపత్రాలు పంచుతూ.. కార్మికులను కార్యోన్ముఖులను చేస్తూ జోరు పెంచారు. కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, ఇతర జేఏసీ నేతలు బీ యాదయ్య తదితరులు యాదిగిరిగుట్ట, వరంగల్, నల్లగొండ వంటి డిపోల్లో సమ్మె సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలను కవర్ చేస్తూ.. జేఏసీ నేతలు ఆయా డిపోల నేతలతో కలిసి డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. జేఏసీ నేతలు వెళ్తున్న ప్రతిచోటా కార్మికులు బ్రహ్మరథం పడుతూ.. సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్‌లతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్న వేళ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.