సంప్రదాయాల ఆధారంగానే.. వివక్ష ఏమీ లేదు: శబరిమల తీర్పుపై సుప్రీంలో సమీక్ష
ఇంటర్నెట్‌డెస్క్: శబరిమల ఆలయం (Sabarimala)లో మహిళల ప్రవేశానికి సంబంధించి గతంలో వెలువడిన తీర్పును మంగళవారం జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది జడ్జీల ధర్మాసనం సమీక్షిస్తోంది. ఈమేరకు పిటిషన్‌దారుల వాదనలు వింటోంది. దీనికి ముందు కేంద్రం తన వివరణను సమర్పించింది.
‘‘ప్రాచీనకాలం నుంచి కొనసాగుతోన్న సంప్రదాయాలకు అనుగుణంగానే ఈ నిషేధం విధించారు కానీ.. దీనికి సంబంధించి వివక్ష ఏమీ లేదు. మహిళల ప్రవేశాన్ని అనుమతించడమనేది ఆరాధనా స్వరూపాన్నే మార్చివేస్తుంది.
ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా శతాబ్దాలుగా భక్తులు (స్త్రీ, పురుషులు ఇద్దరూ) స్వామిని పూజిస్తున్నారు’’ అని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించినదని పేర్కొన్నారు. న్యాయసమీక్షకు అతీతమైందని వాదించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి ఉన్న ఆంక్షలు (Restriction on entry of women) కొనసాగించాలని సుప్రీంకోర్టును కోరారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10-50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధాన్ని రద్దు చేస్తూ 2018లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.